
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తమిళ చిత్రం ‘జీడీఎన్’పై ప్రశంసలు కురిపించారు. ప్రముఖ ఆవిష్కర్త, పారిశ్రామికవేత్త జీడీ నాయుడు (గోపాలస్వామి దొరస్వామి నాయుడు) జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను వీక్షించిన లోకేష్.. అద్భుతంగా ఉందంటూ ట్వీట్ చేశారు.
జీడీ నాయుడును భారతదేశపు ఎడిసన్‌గా అభివర్ణించిన లోకేష్.. ఆవిష్కరణల పట్ల ఆయనకున్న అంకితభావం, పారిశ్రామికవేత్తగా సాధించిన విజయాలు దేశానికి గర్వకారణమన్నారు. భవిష్యత్తును ముందుగానే ఊహించి ఎన్నో ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టిన దార్శనికుడని కొనియాడారు.
జీడీ నాయుడు వంటి గొప్ప వ్యక్తుల జీవితాల గురించి నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందని లోకేష్ అన్నారు. దక్షిణ భారతదేశ పారిశ్రామిక, ఆవిష్కరణల వారసత్వంలో ఇలాంటి అసాధారణ వ్యక్తుల కథలు భాగమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య చారిత్రక, సాంస్కృతిక, ఆర్థిక బంధాలు బలమైనవని గుర్తుచేశారు. ఇలాంటి గొప్ప జీవితాలను వెండితెరపైకి తీసుకొస్తున్న చిత్ర పరిశ్రమను అభినందించారు.
కాగా, లోకేష్ ట్వీట్‌కు ‘జీడీఎన్’ చిత్రంలో జీడీ నాయుడు పాత్రలో నటించిన సీనియర్ నటుడు మాధవన్ స్పందించారు. ప్రశంసలకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.
