
మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారబోతున్నారంటూ కొంతకాలంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై జనసేన నేత అజయ్‌కుమార్ స్పందించారు. బాలినేని జనసేనను వీడే ప్రసక్తే లేదని, ఆయన పార్టీలోనే కొనసాగుతారని స్పష్టం చేశారు.
బాలినేని జనసేన పార్టీకి దూరంగా ఉంటున్నారని, వైఎస్సార్సీపీలోకి తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌తో విభేదాలు, స్థానిక సంస్థల ఎన్నికల కమిటీలో చోటు దక్కకపోవడం వంటి అంశాల కారణంగానే ఆయన అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా బెంగళూరులో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని బాలినేని కలిశారనే వాదన కూడా తెరపైకి వచ్చింది.
ఈ ప్రచారాలను అజయ్‌కుమార్ తీవ్రంగా ఖండించారు. కొంతమంది యూట్యూబర్లు ఎవరి ప్రోద్బలంతో ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్నారో తెలియదని అన్నారు. బాలినేని జనసేనలో చేరినప్పటి నుంచే ఆయనపై ఇలాంటి ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు.
బాలినేని ఎక్కువకాలం జనసేనలో ఉండరని, ఆయన వైఎస్సార్సీపీ కోవర్ట్ అంటూ గతంలోనూ పలువురు వ్యాఖ్యలు చేశారని అజయ్‌కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఆయన జగన్‌ను బెంగళూరులో కలిశారని, తిరిగి వైఎస్సార్సీపీలో చేరబోతున్నారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. బాలినేని జనసేనలోనే కొనసాగుతారని ఆయన పేర్కొన్నారు.
