ఆంధ్రప్రదేశ్‌లో Hindustan Coca-Cola Beverages (HCCB) భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. రాష్ట్రంలో మొత్తం రూ.1,127 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీ ప్రతిపాదనకు రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక కమిటీ ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇందులో భాగంగా విజయనగరం జిల్లాలో కొత్త తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయడంతో పాటు.. శ్రీకాళహస్తిలోని ప్రస్తుత ప్లాంట్‌ను విస్తరించనున్నారు.

విజయనగరం యూనిట్‌ కోసం రూ.842 కోట్లు, శ్రీకాళహస్తి ప్లాంట్‌ విస్తరణకు రూ.285 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు. దక్షిణ భారతదేశంలో పెరుగుతున్న పానీయాల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ విస్తరణ చేపడుతున్నట్లు తెలుస్తోంది.

విజయనగరం ప్లాంట్‌లో తొలి దశలో ఏడాదికి 18 మిలియన్ కేసుల ఉత్పత్తి సామర్థ్యంతో మూడు బాట్లింగ్ లైన్లు ఏర్పాటు చేయనున్నారు. కార్బొనేటెడ్‌ సాఫ్ట్‌ డ్రింక్స్‌, జ్యూస్‌, టెట్రా ప్యాక్‌ ఉత్పత్తులకు వీటిని వినియోగించనున్నారు. రెండో దశలో మరో రెండు బాట్లింగ్ లైన్లను ఏర్పాటు చేసి 12 మిలియన్ కేసుల అదనపు సామర్థ్యాన్ని కల్పించనున్నారు.

శ్రీకాళహస్తి యూనిట్‌లో ఒక ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌ బాట్లింగ్ లైన్‌, రెండు కార్బొనేటెడ్‌ సాఫ్ట్‌ డ్రింక్‌ లైన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఉన్న ప్లాంట్‌ ప్రాంగణంలోనే విస్తరణ చేపట్టనుండటంతో అదనంగా భూసేకరణ అవసరం ఉండదని కంపెనీ ప్రతిపాదనలో పేర్కొన్నట్లు సమాచారం.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *