ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే గడువును ప్రభుత్వం మరో రెండు రోజులు పొడిగించింది. సెప్టెంబర్‌ 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

వాస్తవానికి ఈ నెల 7 నుంచి 16 వరకు దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వరుస సెలవులు, ఇంకా కొంతమంది అర్హులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండటంతో గడువును పొడిగించినట్లు మంత్రి తెలిపారు. అర్హులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని రెండు రోజుల్లో దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.

వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, కల్లుగీత కార్మికులు, డప్పు కళాకారులు, సంప్రదాయ చెప్పుల తయారీదారులు, ట్రాన్స్‌జెండర్లు తదితర అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్‌ నమోదు, ఈ-కేవైసీకి ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

అర్హులు అవసరమైన పత్రాలతో దరఖాస్తును సంబంధిత కేంద్రాల్లో సమర్పించాలి. ఆన్‌లైన్‌లో నమోదు చేసిన అనంతరం సిస్టమ్‌ జనరేటెడ్‌ అక్నాలెడ్జ్‌మెంట్‌ అందజేస్తారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 61,92,396 మంది పింఛనుదారులకు ప్రభుత్వం నెలకు రూ.2,694 కోట్ల మేర పింఛన్లు పంపిణీ చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వృద్ధులు, వితంతువుల పింఛన్‌ను రూ.4 వేలకు, దివ్యాంగుల పింఛన్‌ను రూ.6 వేలకు పెంచింది. ప్రతి నెలా ఒకటో తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దే పింఛన్‌ అందించే విధానం కొనసాగుతోంది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *