
ఆర్థిక మోసాల ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్, ‘నందూస్ వరల్డ్’ ఛానల్ నిర్వాహకురాలు రమానందన మరోసారి ఇబ్రహీంపట్నం పోలీసుల విచారణకు హాజరయ్యారు. తనపై ఉన్న లుక్అవుట్ సర్క్యులర్ ఎత్తివేస్తే లండన్ వెళ్లిపోతానని పోలీసులను కోరినట్లు తెలుస్తోంది. తన భర్త మధుకర్ భారత్‌కు వచ్చిన తర్వాత ఆయనను విచారించాలని లాయర్ ద్వారా విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
ఈ నెల 16న విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు ఇచ్చినా.. న్యాయవాదుల సూచనతో ఒకరోజు ముందుగానే ఆమె పోలీసుల ఎదుట హాజరయ్యారు. గత విచారణలో అడిగిన కొన్ని ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎల్వోసీ ఎత్తివేతపై పోలీసులు న్యాయ సలహా తీసుకుని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
విదేశాల్లో ఉద్యోగాలు, సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసి మోసం చేశారంటూ క్రాంతికుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రమానందనపై లుక్అవుట్ నోటీసులు జారీ కాగా.. లండన్ నుంచి హైదరాబాద్ వచ్చిన సమయంలో శంషాబాద్ విమానాశ్రయంలో ఆమెను ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే డెస్టినీ కన్సల్టెన్సీ వ్యవహారాలతో తనకు సంబంధం లేదని, వాటిని తన భర్త మధుకర్, అకౌంటెంట్ చూసుకుంటారని రమానందన పోలీసులకు తెలిపినట్లు సమాచారం.
మరోవైపు ప్రకాశం జిల్లా అద్దంకి పోలీసులు కూడా రమానందనకు నోటీసులు జారీ చేశారు. శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై ఈ నెల 17న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. రెండు కేసులు కొనసాగుతున్న నేపథ్యంలో రమానందనపై ఉన్న లుక్అవుట్ సర్క్యులర్‌పై పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
