
ఒంగోలు: తాను ఆత్మహత్య చేసుకున్నట్లు ఓ ఆన్లైన్ న్యూస్ యాప్‌కు వార్త పంపించి ఓ ఇంజినీరింగ్ విద్యార్థి పోలీసులను పరుగులు పెట్టించాడు. ఆ వార్త నిజమేనని భావించిన న్యూస్ యాప్ దాన్ని ప్రచురించడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రకాశం జిల్లా మర్రిపూడికి చెందిన యువకుడు ఒంగోలులో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతూ హాస్టల్లో ఉంటున్నాడు. ఓ న్యూస్ యాప్‌కు వార్తలు పంపించే అతడు.. తన వార్తలు ప్రచురితం కాకపోవడంతో ఈ వింత పని చేశాడు.
తాను మంగమూరు రోడ్డులోని హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్నట్లు, వినాయకచవితికి స్నేహితులు సొంతూళ్లకు వెళ్లిన సమయంలో ఘటన జరిగిందంటూ వార్త పంపించాడు. తన పేరు, ఊరు, ఫొటోను కూడా జత చేశాడు. ఆ వార్త ప్రచురితం కావడంతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది.
సమాచారం అందుకున్న పోలీసులు యువకుడి కోసం కాలేజీలు, హాస్టళ్లలో గాలించారు. కుటుంబసభ్యులను సంప్రదించగా.. కొద్దిసేపటి క్రితమే అతడితో మాట్లాడినట్లు తెలిపారు. చివరకు యువకుడిని గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా.. తన వార్తలు ప్రచురితం కాకపోవడంతో ఇలా చేసినట్లు చెప్పాడు.
దీంతో పోలీసులు అతడిని హెచ్చరించి పంపించారు. సోషల్ మీడియాలో నిరాధార వార్తలను ప్రచురించే ముందు నిజానిజాలు నిర్ధారించుకోవాలని సూచించారు.
