ఏపీలో రైలు ప్రయాణికులు, తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సమాచారం అందించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుపతి–విజయవాడ మధ్య ప్రత్యేక రైలును నడపనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 20న ఈ ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది.

తిరుపతి–విజయవాడ ప్రత్యేక రైలు (07606) సెప్టెంబర్ 20న అర్ధరాత్రి 1.15 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరుతుంది. రేణిగుంట జంక్షన్, శ్రీకాళహస్తి, గూడూరు జంక్షన్, నెల్లూరు, కావలి, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి జంక్షన్ మీదుగా ప్రయాణించి ఉదయం 8 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.

అదే రోజు విజయవాడ–తిరుపతి ప్రత్యేక రైలు (07605) ఉదయం 9 గంటలకు విజయవాడ నుంచి బయల్దేరుతుంది. తెనాలి జంక్షన్, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు జంక్షన్, శ్రీకాళహస్తి, రేణిగుంట జంక్షన్ మీదుగా ప్రయాణించి సాయంత్రం 4.45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ అధికంగా ఉంది. ముఖ్యంగా వారాంతాలు, వరుస సెలవుల సమయంలో భక్తుల సంఖ్య మరింత పెరుగుతోంది. ప్రస్తుతం తిరుమలలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతుండటంతో రద్దీ మరింత ఎక్కువైంది. సామాన్య భక్తులకు దర్శనం కల్పించేందుకు టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనాలు, కొన్ని ఆర్జిత సేవలను కూడా రద్దు చేస్తోంది.

ఈ నేపథ్యంలో తిరుపతి వైపు ప్రయాణించే భక్తులు, విజయవాడ–తిరుపతి మార్గంలోని ప్రయాణికులకు ఈ ప్రత్యేక రైలు కొంత మేరకు ఉపయోగపడనుంది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *