వారణాసి పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, పంకజ్‌ చౌదరి, చిరాగ్‌ పాశ్వాన్‌, ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రసాదాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’లో భాగంగా వారణాసి-వాద్‌నగర్‌ కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ.. దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారని అన్నారు.

మోదీ నాయకత్వంలో భారత్‌ అనేక రంగాల్లో పురోగతి సాధిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌, రక్షణ రంగంలో స్వావలంబన వంటి అంశాలను ప్రస్తావిస్తూ.. మోదీ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను కొనియాడారు. దేశ ప్రజలంతా జాతి నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

వారణాసి ప్రధాని మోదీ కర్మభూమి అని చంద్రబాబు అన్నారు. మోదీ బాల్యం నుంచి ఎదురైన ఇబ్బందులు ఆయన ఎదుగుదలకు అడ్డంకిగా మారలేదని పేర్కొన్నారు. అలాగే అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తవడం, దేశ అభివృద్ధి వంటి అంశాలను ప్రస్తావించారు.

కాగా, ప్రధాని మోదీకి చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందనలు తెలియజేశారు. ‘సేవ, సంకల్పం, సుశాసన్‌’ అనే దార్శనికత ప్రజలకు స్ఫూర్తినిస్తోందని పేర్కొన్నారు. మోదీ ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కోసం ఆకాంక్షిస్తూ.. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ సెప్టెంబర్‌ 17 నుంచి అక్టోబర్‌ 17 వరకు ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’ నిర్వహిస్తోంది. ఇందులో సేవా కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *