
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించడంతో పాటు గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకం కింద 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే బీసీ కుటుంబాలకు రూఫ్‌టాప్ సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు అదనపు రాయితీ అందిస్తోంది.
అర్హులైన బీసీ కుటుంబాలకు 2 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో యూనిట్‌కు సుమారు రూ.1.30 లక్షల వరకు ఖర్చవుతుండగా.. కేంద్ర ప్రభుత్వం రూ.60 వేల సబ్సిడీ అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.20 వేల రాయితీ ఇవ్వడంతో మొత్తం రూ.80 వేల వరకు సబ్సిడీ లభించనుంది. మిగిలిన సుమారు రూ.50 వేల మొత్తాన్ని బ్యాంకు రుణం ద్వారా సమకూర్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
సోలార్ యూనిట్ ఏర్పాటైన తర్వాత రుణ మొత్తాన్ని లబ్ధిదారులు ఏడేళ్ల పాటు ఈఎంఐల రూపంలో చెల్లించే అవకాశం ఉంటుంది. ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను ముందుగా ఇంటి అవసరాలకు వినియోగించుకుని, మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయించే అవకాశం కూడా ఉంటుంది.
ప్రస్తుతం 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగిస్తున్న బీసీ కుటుంబాల వివరాలను విద్యుత్‌శాఖ సిబ్బంది సేకరిస్తున్నారు. అర్హుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఆసక్తి ఉన్న వారు సమీప సచివాలయం లేదా విద్యుత్‌శాఖ అధికారులను సంప్రదించి వివరాలు తెలుసుకుని దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
కాగా, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కూడా ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకం కింద ప్రత్యేక రాయితీలతో సోలార్ యూనిట్లను అందించే ప్రక్రియ కొనసాగుతోంది.
