ఆంధ్రప్రదేశ్‌లో మరో ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలోని కనిగిరిలో ట్రిపుల్‌ ఐటీ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఈ నెల 30న మంత్రి నారా లోకేష్‌ చేతుల మీదుగా క్యాంపస్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం రూ.25 కోట్లు విడుదల చేయగా.. శంకుస్థాపన అనంతరం నిర్మాణ పనులను వేగంగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

వాస్తవానికి 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం కనిగిరి నియోజకవర్గంలోని పామూరు మండలం దూబగుంట వద్ద ట్రిపుల్‌ ఐటీ నిర్మించాలని నిర్ణయించింది. అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన కూడా చేశారు. అయితే 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దూబగుంటలో కాకుండా కనిగిరి మండలం బల్లిపల్లి, పామూరు మండలం బోడవాడ ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించింది. అనంతరం బల్లిపల్లి వద్ద నిర్మించాలని నిర్ణయించి 276 ఎకరాల భూమిని సిద్ధం చేసింది. అయితే నిర్మాణ పనులు మాత్రం ముందుకు సాగలేదు.

ప్రస్తుతం ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు ఒంగోలులోని అద్దె భవనాల్లో విద్యను కొనసాగిస్తున్నారు. 2024 ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ట్రిపుల్‌ ఐటీ నిర్మాణ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వం రూ.25 కోట్లను మంజూరు చేసింది.

ఇటీవల అధికారులు బల్లిపల్లి వద్ద సిద్ధం చేసిన 276 ఎకరాల భూమిని పరిశీలించారు. జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు పూర్తికాగా.. టెండర్‌ ప్రక్రియ కూడా ముగిసింది. ప్రస్తుతం ప్రాథమిక పనులు ప్రారంభమయ్యాయి. ఈ నెల 30న శంకుస్థాపన అనంతరం తరగతి గదులు, ట్యుటోరియల్‌ గదులు తదితర నిర్మాణ పనులను చేపట్టనున్నారు.

ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే వెనుకబడిన మార్కాపురం జిల్లా, కనిగిరి ప్రాంతంలో విద్యాపరమైన అభివృద్ధికి ఊతం లభిస్తుందని స్థానికులు భావిస్తున్నారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ట్రిపుల్‌ ఐటీ నిర్మాణానికి ఇప్పుడు కదలిక రావడంతో ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *