
ఆంధ్రప్రదేశ్‌లో పీఎం కిసాన్ లబ్ధిదారులకు వ్యవసాయశాఖ కీలక సూచనలు చేసింది. భవిష్యత్‌లో పీఎం కిసాన్ నిధుల విడుదలకు ఫార్మర్ రిజిస్ట్రీలో రైతుల నమోదు తప్పనిసరి చేయాలని కేంద్రం ప్రతిపాదించిన నేపథ్యంలో.. రాష్ట్రంలోని రైతులంతా తమ వివరాలను నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
రాష్ట్రంలో మొత్తం 64,71,800 మంది పీఎం కిసాన్ లబ్ధిదారులు ఉండగా.. ఇప్పటివరకు 52,06,777 మంది రైతుల ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు పూర్తయింది. అంటే దాదాపు 80 శాతం మంది నమోదు చేసుకున్నారు. ఇంకా 7.34 లక్షల మంది రైతులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉందని వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు.
వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సమూన్ జిల్లా, మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించి.. గ్రామాల వారీగా పెండింగ్‌లో ఉన్న రైతులను గుర్తించి రిజిస్ట్రీ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. రైతులు తమ ఫార్మర్ యూనిక్ ఐడీని పొందేలా అధికారులు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
పీఎం కిసాన్ పథకం కింద ప్రస్తుతం రైతులకు ఏడాదికి రూ.6,000 చొప్పున మూడు విడతల్లో నిధులు అందుతున్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడతను జూన్ 20న కేంద్రం విడుదల చేసింది.
ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు ద్వారా రైతుల వివరాలను డిజిటల్‌గా ధ్రువీకరించడం, ప్రభుత్వ వ్యవసాయ పథకాలను అర్హులైన రైతులకు అందించడం లక్ష్యంగా చర్యలు కొనసాగుతున్నాయి. అందువల్ల పెండింగ్‌లో ఉన్న రైతులు వీలైనంత త్వరగా రిజిస్ట్రీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
