రైతన్నలకు ఇష్టమైన వంటకం ఇదే. టమోటాలు, పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లి, కొత్తిమీర వంటి పదార్థాలతో ఈ పచ్చడిని సులభంగా తయారు చేసుకోవచ్చు. ముందుగా వేయించి, ఆపై రోట్లో లేదా మిక్సీలో దంచుకుంటే రుచికరమైన ఈ టమోటా పచ్చడిని సిద్ధం చేసుకోవచ్చు. ఇది వేడి అన్నంలోకి అద్భుతంగా ఉంటుంది.

కావాల్సిన పదార్థాలు: 5 టమోటాలు, 10 పచ్చిమిరపకాయలు, ఒక వెల్లుల్లి గడ్డ, నిమ్మకాయ సైజు చింతపండు, 2 టేబుల్ స్పూన్ల నూనె, తగినంత ఉప్పు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక కప్పు కొత్తిమీర, ఒక చిన్న ఉల్లిపాయ తీసుకోవాలి.

తయారీ విధానం:

1. ముందుగా మందపాటి బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక శుభ్రంగా కడిగిన టమోటాలు, పచ్చిమిరపకాయలు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి మధ్యస్థ మంటపై 4–6 నిమిషాలు వేయించాలి. టమోటాలు మెత్తబడడంతో పాటు పచ్చిమిరపకాయలు రంగు మారే వరకు వేయించాలి. అనంతరం చింతపండు వేసి మరోసారి కలిపి వేయించాలి. పదార్థాలు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి.

2. చల్లారిన తర్వాత పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిని రోట్లో వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా దంచాలి. అనంతరం వేయించిన చింతపండును కూడా వేసి మిశ్రమంతో బాగా కలిసేలా దంచుకోవాలి. రోలు లేకపోతే మిక్సర్ గ్రైండర్‌లో కూడా చేసుకోవచ్చు.

3. ఇప్పుడు వేయించి చల్లార్చుకున్న టమోటాలను వేసి మరీ మెత్తగా కాకుండా కాస్త గరుకుగా ఉండేలా దంచుకోవాలి. ఇలా చేస్తే పచ్చడిలో టమోటా రుచి, ముక్కల టెక్స్చర్ బాగా తెలుస్తుంది. చివరగా కొత్తిమీర, చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసి అన్నింటినీ బాగా కలపాలి.

4. అంతే.. ఎంతో రుచికరమైన టమోటా పచ్చిమిర్చి పచ్చడి సిద్ధం. వేడి అన్నంలో నెయ్యితో కలిపి తిన్నా, దోశ, ఇడ్లీ, రొట్టెలతో తిన్నా రుచిగా ఉంటుంది. ఇంట్లో సులభంగా తయారు చేసుకునే ఈ పచ్చడి భోజనానికి మంచి రుచిని జోడిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *