
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గుడ్‌న్యూస్ చెప్పారు. కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక ప్రాంతాన్ని కడప బైపాస్‌తో అనుసంధానించేలా నాలుగు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణానికి రూ.304.44 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
కొప్పర్తి నుంచి కడప బైపాస్ వరకు 5.8 కిలోమీటర్ల మేర యాక్సెస్ కంట్రోల్డ్ హైవే నిర్మించనున్నారు. ఇందులో ఒక ట్రంపెట్ ఇంటర్‌ఛేంజ్, రెండు భారీ వంతెనలు, నాలుగు వెహిక్యులర్ అండర్‌పాస్‌లు ఉంటాయి. ప్రస్తుతం ఉన్న కడప బైపాస్‌ను పేవ్డ్ షోల్డర్స్‌తో అభివృద్ధి చేయనున్నారు.
ఈ రహదారి విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాను జాతీయ రహదారులతో అనుసంధానించనుంది. దీంతో కడప నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు పారిశ్రామిక ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి.
మరోవైపు కడప-కర్నూలు మధ్య 189 కిలోమీటర్ల జాతీయ రహదారిని యాక్సెస్ కంట్రోల్డ్ హైవేగా అభివృద్ధి చేయనున్నారు. భారత్‌మాల ఫేజ్-2లో భాగంగా చేపట్టే ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.5,700 కోట్లు ఖర్చు చేయనున్నారు. హైవేకు ఇరువైపులా రెండు లేన్ల సర్వీస్ రోడ్లు, అవసరమైన చోట్ల బ్రిడ్జిలు, ఎంట్రీ-ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేయనున్నారు.
ఓర్వకల్ ఇండస్ట్రియల్ ఏరియాను హైవేతో అనుసంధానించేందుకు 4 కిలోమీటర్ల రహదారిని కూడా నిర్మించనున్నారు. ఈ పనులకు సంబంధించిన డీపీఆర్ ఇప్పటికే పూర్తయింది.
