ఏపీ మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (APREIS) 59వ గవర్నింగ్ బాడీ సమావేశం జరిగింది. రాష్ట్రంలోని రెసిడెన్షియల్ స్కూళ్లలో అకడమిక్ ఎక్సలెన్స్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు, ఉపాధ్యాయులకు లోకేష్ సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా 10 ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లుగా అభివృద్ధి చేసేందుకు సమావేశంలో ఆమోదం తెలిపారు. తాడికొండ, కొడిగెనహళ్లి పాఠశాలలను ఇప్పటికే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లుగా అభివృద్ధి చేయగా.. మరో ఆరు పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించారు.

మాజీ సీఎం ఎన్టీ రామారావు స్వగ్రామమైన కృష్ణా జిల్లా నిమ్మకూరులోని ఏపీఆర్‌జేసీలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి JEE, NEET అకాడమీని ఏర్పాటు చేయనున్నారు. అలాగే కాకినాడ జిల్లా భూపతిపాలెం స్కూల్‌ను వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ హబ్‌గా అభివృద్ధి చేయాలని మంత్రి ఆదేశించారు.

రెసిడెన్షియల్ స్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్‌లు, ఏఐ నైపుణ్యాలను తప్పనిసరి చేయడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల్లో స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బోధన, బోధనేతర సిబ్బందిని నియమించేందుకు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.

సిబ్బంది సర్వీస్ రూల్స్ కోసం కమిటీ ఏర్పాటు, పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. అత్యవసర వైద్య అవసరాల కోసం ఒక్కో విద్యార్థికి రూ.లక్ష వరకు ఖర్చు చేసే వెసులుబాటు కల్పించారు. గెస్ట్ లెక్చరర్ల గౌరవ వేతనాలను పెంచడంతో పాటు PETలను PDలుగా అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించారు.

ఇంటర్ బోర్డులోనూ కీలక నిర్ణయాలు

మంత్రి లోకేష్ అధ్యక్షతన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ 78వ పాలకవర్గ సమావేశం కూడా జరిగింది. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో పాల్గొనే సిబ్బందికి భత్యాన్ని 25 శాతం వరకు పెంచే ప్రతిపాదనకు ఆమోదం లభించింది.

1978 నుంచి ఇప్పటివరకు ఇంటర్మీడియట్ బోర్డు జారీ చేసిన అన్ని సర్టిఫికెట్లను డిజిటలైజ్ చేసి బ్లాక్‌చైన్ టెక్నాలజీతో అనుసంధానించాలని నిర్ణయించారు. ఇంటర్మీడియట్ బోర్డు సిబ్బంది పదవీ విరమణ వయసును కూడా 60 నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు ఆమోదం తెలిపారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *