తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ వ్యవహారంపై దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. సీబీఐ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌, తాజాగా ఈడీ వెల్లడించిన వివరాల ప్రకారం.. లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యి నమూనాల్లో జంతు కొవ్వు ఉన్నట్లు నిర్ధారించే ఆధారాలు లభించలేదు. ప్రయోగశాల పరీక్షల్లో కూడా జంతు కొవ్వు గుర్తించలేదని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి.

అయితే నెయ్యి సరఫరాలో కల్తీ జరిగినట్లు దర్యాప్తులో తేలింది. సీబీఐ SIT ప్రకారం పామ్‌ ఆయిల్‌, పామ్‌ స్టియరిన్‌, పామ్‌ కర్నెల్‌ ఆయిల్‌ వంటి వృక్ష ఆధారిత పదార్థాలు ఉపయోగించినట్లు గుర్తించారు. తాజాగా ఈడీ కూడా రిఫైన్డ్‌ పామ్‌ ఆయిల్‌, పామోలిన్‌, పామ్‌ కర్నెల్‌ ఆయిల్‌తో పాటు పలు రసాయనాలను కల్తీ పదార్థాలుగా గుర్తించినట్లు వెల్లడించింది.

ఈ వ్యవహారంలో నకిలీ లేదా కల్తీ నెయ్యిని అసలైన నెయ్యిగా సరఫరా చేశారనే ఆరోపణలపై ఈడీ మనీలాండరింగ్‌ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో సుకృతి ఫుడ్స్‌ ప్రమోటర్‌ కైలాష్‌ చంద్‌ మంగ్లాను సెప్టెంబర్‌ 17న అరెస్ట్‌ చేసినట్లు ఈడీ తెలిపింది.

అందువల్ల ప్రస్తుత దర్యాప్తు వివరాల ప్రకారం జంతు కొవ్వు వినియోగానికి ఆధారాలు లేవని, అయితే నెయ్యి కల్తీ వ్యవహారం మాత్రం దర్యాప్తులో బయటపడిందని చెప్పవచ్చు. 2024లో వెలుగులోకి వచ్చిన జంతు కొవ్వు ఆరోపణలపై రాజకీయంగా భిన్న అభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ, దర్యాప్తు సంస్థల తాజా నివేదికల్లో నమోదైన అంశాలు ఇవే.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *