కోలీవుడ్‌లో దసరా రేసు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ధనుష్ హీరోగా నటించిన ‘ఓం’ అక్టోబర్ 16న విడుదల కావాల్సి ఉంది. వరుసగా రెండు రోజుల్లో ఈ రెండు సినిమాలు థియేటర్లలోకి రానుండటంతో తమిళ సినీ వర్గాల్లో పోటీపై చర్చ మొదలైంది.

అయితే ‘జైలర్ 2’ వాయిదా పడే అవకాశం ఉందంటూ ఇటీవల రూమర్స్ రావడంతో ఆ సినిమా టీమ్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసినట్లు కనిపిస్తోంది. వరుస అప్‌డేట్స్‌తో రజనీకాంత్ అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది. మరోవైపు ధనుష్ ‘ఓం’ టీమ్ మాత్రం చాలా సైలెంట్‌గా తమ పనిని కొనసాగిస్తోంది.

‘ఓం’పై సైలెంట్ ప్రమోషన్స్

‘అమరన్’ తర్వాత దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి తెరకెక్కిస్తున్న సినిమా ‘ఓం’. ఇందులో ధనుష్ సరసన సాయిపల్లవి, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ ఇద్దరి పాత్రలు, లుక్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలను చిత్రబృందం వెల్లడించలేదు.

సుమారు రెండు వారాల క్రితం మలయాళ స్టార్ మమ్ముట్టి పాత్రను పరిచయం చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఆ తర్వాత మాత్రం పెద్దగా ప్రమోషనల్ అప్‌డేట్స్ ఏవీ కనిపించలేదు. దీంతో అక్టోబర్ 16న నిజంగానే సినిమా విడుదల అవుతుందా? లేక వాయిదా పడుతుందా? అనే సందేహాలు కోలీవుడ్‌లో వినిపిస్తున్నాయి.

నవంబర్ లేదా డిసెంబర్‌కు మారుతుందా?

అక్టోబర్‌లో ‘ఓం’ విడుదల కాకపోతే నవంబర్ 27 లేదా డిసెంబర్ 2 తేదీల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.

ఓవైపు ‘జైలర్ 2’పై అప్‌డేట్స్ వస్తుండగా.. మరోవైపు ‘ఓం’ టీమ్ నుంచి నిశ్శబ్దం కొనసాగుతుండటంతో రిలీజ్ డేట్‌పై ఊహాగానాలు మరింత పెరుగుతున్నాయి.

ధనుష్‌కు ‘ఓం’పై భారీ ఆశలు

ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. గతేడాది వచ్చిన ‘ఇడ్లీ కడై’కు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించగా.. ఈ ఏడాది విడుదలైన ‘కర’ మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో ‘ఓం’తో మళ్లీ మంచి విజయాన్ని అందుకోవాలని ధనుష్ అభిమానులు ఆశిస్తున్నారు.

ఇక ‘ఓం’ తర్వాత ధనుష్ తన తదుపరి ప్రాజెక్ట్‌గా తమిరళసన్ పచ్చముత్తు దర్శకత్వంలో డీ56ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ధనుష్ పాత వివాదాలు మళ్లీ తెరపైకి?

ఇదిలా ఉంటే ధనుష్‌కు సంబంధించిన కొన్ని పాత ఆర్థిక వివాదాలు మరోసారి చర్చకు వచ్చినట్లు సమాచారం. ‘థెనండల్ మురళి’, ‘ఫైవ్ స్టార్ కతిరేసన్’లతో ఉన్న ఆర్థిక వ్యవహారాల విషయంలో సమస్యలు కొనసాగుతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

తమకు చెల్లించాల్సిన మొత్తాలు పరిష్కరించే వరకు ధనుష్ తదుపరి సినిమాల నిర్మాణాన్ని ప్రారంభించకూడదంటూ నిర్మాతల సంఘాన్ని వారు కోరినట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారంపై అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

ఇక ‘జైలర్ 2’, ‘ఓం’ సినిమాల రిలీజ్ డేట్లపై స్పష్టత రావడంతో పాటు.. ఈ వివాదాల విషయంలో ధనుష్ టీమ్ ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *