
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఖాళీ కానున్న 12 రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 29న ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుండగా, అక్టోబర్ 16న పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని 10 రాజ్యసభ స్థానాల్లో భాజపా 8, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) 2 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ ఎన్నికలతో పార్లమెంటులో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ప్రాతినిధ్యం పూర్తిగా ముగిసే పరిస్థితి ఏర్పడనుంది. ఇదిలా ఉండగా, కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ పురీ రాజ్యసభ సభ్యత్వం పునరుద్ధరణపై కూడా ఉత్కంఠ నెలకొంది.
దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా రాజ్యసభ ఎన్నికల రాజకీయ సందడి మళ్లీ మొదలైంది. మూడు కీలక రాష్ట్రాల్లో ఖాళీ కానున్న మొత్తం 12 రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం అధికారికంగా ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది.
ఈసీ వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 29న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అక్టోబర్ 6 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ పూర్తైన అనంతరం అక్టోబర్ 16న ఉదయం పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు.
మొత్తం ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల్లో అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌కే చెందినవి ఉన్నాయి. ఆ రాష్ట్రంలో ఖాళీ అవుతున్న 10 స్థానాలతో పాటు ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్‌లోని ఒక్కో స్థానానికి కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోని స్థానాలను అధికార బీజేపీ ఎలాంటి పోటీ లేకుండా దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ నుంచి మరో రాజ్యసభ స్థానం బీజేపీ ఖాతాలో చేరితే, పెద్దల సభలో ఆ పార్టీ బలం మరింత పెరగనుంది.
ఇక ఉత్తర్‌ప్రదేశ్‌లో ఖాళీ అవుతున్న 10 స్థానాల్లో ఎనిమిదింటిని బీజేపీ తిరిగి గెలుచుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మిగిలిన రెండు స్థానాలను ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ మద్దతుతో గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో గతంతో పోలిస్తే రాజ్యసభలో ఎస్పీకి ఒక సీటు అదనంగా దక్కే పరిస్థితి ఏర్పడనుంది.
