
విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మరో కొత్త విమాన సర్వీస్ అందుబాటులోకి రానుంది. భోగాపురం నుంచి ఢిల్లీకి నేరుగా ఆకాశ ఎయిర్ విమాన సేవలను ప్రారంభించనుంది. అక్టోబర్ 25 నుంచి ప్రతిరోజూ ఈ సర్వీస్ నడవనుంది.
ఢిల్లీ నుంచి ఉదయం 5.55 గంటలకు బయలుదేరే విమానం 8.20 గంటలకు భోగాపురం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఉదయం 9.05 గంటలకు భోగాపురం నుంచి బయలుదేరి 11.30 గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది. దీంతో ఉత్తరాంధ్ర నుంచి దేశ రాజధానికి నేరుగా ప్రయాణించే వారికి మరింత సౌకర్యం కలగనుంది.
ప్రస్తుతం భోగాపురం విమానాశ్రయం నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై వంటి నగరాలకు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా సింగపూర్, బ్యాంకాక్ నగరాలకు కూడా విమాన సేవలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా ఢిల్లీకి ఆకాశ ఎయిర్ కొత్త సర్వీస్ ప్రారంభం కానుంది.
ఆకాశ ఎయిర్ భోగాపురం నుంచి ఢిల్లీకి నేరుగా సేవలు ప్రారంభించనుండటంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. మూడేళ్ల తర్వాత ఆకాశ ఎయిర్‌లైన్స్ ఉత్తరాంధ్రలో సేవలను పునఃప్రారంభించడం సంతోషకరమన్నారు. ఈ కొత్త సర్వీస్‌తో ఉత్తరాంధ్ర ప్రజలకు ఢిల్లీ ప్రయాణం మరింత సులభతరం అవుతుందని తెలిపారు. భవిష్యత్‌లో భోగాపురం నుంచి దేశంలోని మరిన్ని ప్రధాన నగరాలకు విమాన కనెక్టివిటీని విస్తరించనున్నట్లు చెప్పారు.
మరోవైపు కొత్త నిబంధనలతో ఉడాన్ పథకం అమలుకు కేంద్ర పౌర విమానయాన శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏపీఏడీసీఎల్ ఎండీ ప్రవీణ్ ఆదిత్య ఒప్పందంపై సంతకం చేశారు. ఏపీతో పాటు మరో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు కూడా ఒప్పందాలపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం 2026-27 నుంచి 2035-36 వరకు పదేళ్ల పాటు అమల్లో ఉండనుంది. ఉడాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.28,840 కోట్లు ఖర్చు చేయనుంది. కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు.
