
D news:nov:7క్యాన్సర్ అనేది ఒకే రకమైన వ్యాధి కాదు. క్యాన్సర్ రకం, వ్యాధి దశ, రోగి ఆరోగ్య పరిస్థితులను బట్టి చికిత్సా విధానాలు మారుతుంటాయి. అయితే, సామాజిక మాధ్యమాల్లో శాస్త్రీయంగా నిరూపితం కాని చికిత్సా పద్ధతులను ఆధునిక వైద్యానికి ప్రత్యామ్నాయాలుగా ప్రచారం చేయడం ఆందోళన కలిగిస్తోంది. క్యాన్సర్ నిర్ధారణ అయినప్పుడు రోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర భయం, ఆందోళనకు గురవుతారు. ఇలాంటి మానసిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని తప్పుడు వైద్య సమాచారాన్ని నమ్మే ప్రమాదం ఉంది.
క్యాన్సర్ అనేది ఒకే రకమైన వ్యాధి కాదు. క్యాన్సర్ రకం, వ్యాధి దశ, రోగి ఆరోగ్య పరిస్థితులను బట్టి చికిత్సా విధానాలు మారుతుంటాయి. అయితే, ఆధునిక వైద్యానికి ప్రత్యామ్నాయాలంటూ శాస్త్రీయంగా నిరూపితం కాని చికిత్సా పద్ధతులను సామాజిక మాధ్యమాల్లో కొందరు ప్రచారం చేస్తున్నారు.
క్యాన్సర్ నిర్ధారణ కాగానే రోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవడం సహజం. ఈ క్రమంలో సరైన సమాచారం, చికిత్స కోసం వైద్యులను సంప్రదించడంతోపాటు సామాజిక మాధ్యమాలు, ఆన్లైన్ వీడియోలు, సంప్రదాయ వైద్య పద్ధతులు, ఇతరుల అనుభవాలపై ఆధారపడుతుంటారు. కానీ, ఇలాంటి సున్నితమైన సమయంలో నిరాధారమైన ప్రచారాన్ని నమ్మడం చికిత్స ఎంపికలపై ప్రభావం చూపడమే కాకుండా, సరైన వైద్యం అందడంలోనూ ఆలస్యానికి కారణం కావచ్చు.
సోషల్ మీడియా వేదికగా క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేస్తామంటూ కొన్ని ప్రత్యామ్నాయ చికిత్సలపై విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఆధునిక వైద్య విధానాలు హానికరమని, సంప్రదాయ లేదా సహజ చికిత్సలతోనే క్యాన్సర్‌ను జయించవచ్చని కొందరు వాదిస్తున్నారు. తమకు నయమైందంటూ వ్యక్తిగత అనుభవాలను సైతం ఉదాహరణలుగా చూపిస్తున్నారు. అయితే, ఒకరి అనుభవం ఆధారంగా ఏ చికిత్స ప్రభావవంతమైనదని నిర్ధారించలేం. కణితి పరిమాణం తగ్గించడం, క్యాన్సర్ తిరిగి రాకుండా అడ్డుకోవడం, మరణ ముప్పును తగ్గించడం వంటి అంశాలకు శాస్త్రీయ పరిశోధనలు, విశ్వసనీయ వైద్య ఆధారాలు తప్పనిసరి. క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేస్తామంటూ హామీలివ్వడం, రహస్య చికిత్సా విధానాల పేరుతో ఆకర్షించడం, వైద్యులు సూచించిన మందులను నిలిపివేయాలని సలహా ఇవ్వడం వంటి ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. నిరూపణ లేని చికిత్సలను ఆశ్రయించడం వల్ల సరైన వైద్య చికిత్స ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, సహజసిద్ధమైన పదార్థాలు, మూలికా ఔషధాలు, పోషకాహార సప్లిమెంట్లు సైతం క్యాన్సర్ మందులతో ప్రతిచర్యకు కారణమై వాటి ప్రభావాన్ని మార్చవచ్చు. అందువల్ల తాము తీసుకుంటున్న ప్రతి ఔషధం, సప్లిమెంట్ గురించి వైద్యులకు తప్పనిసరిగా తెలియజేయాలి. ఫలితం లేని చికిత్సలతో ఆర్థికంగా నష్టపోవడంతో పాటు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశమూ ఉంది.
శాస్త్రీయ ఆధారాలతో కూడిన క్యాన్సర్ చికిత్సలో పరిశోధనల ఫలితాలు, వైద్య నిపుణుల అనుభవం, రోగి వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులకు ప్రాధాన్యం ఇస్తారు. క్యాన్సర్ రకం, వ్యాధి దశ, జన్యుపరమైన లక్షణాలు, రోగి వయసు, సాధారణ ఆరోగ్య పరిస్థితి, చికిత్సకు శరీరం స్పందించే విధానం ఆధారంగా వైద్య విధానాన్ని నిర్ణయిస్తారు. ఇందుకోసం వైద్యులు, శస్త్రచికిత్స నిపుణులు, రేడియేషన్ ఆంకాలజిస్టులు, రేడియాలజిస్టులు, పాథాలజిస్టులతో కూడిన ప్రత్యేక వైద్య బృందం రోగి పరిస్థితిని సమగ్రంగా విశ్లేషిస్తుంది. చికిత్సపై సందేహాలు లేదా అభ్యంతరాలు ఉంటే అర్హత కలిగిన మరో నిపుణుడిని సంప్రదించి రెండో అభిప్రాయం తీసుకోవచ్చు. ఇదే సమయంలో యోగా, ధ్యానం, కౌన్సెలింగ్ వంటి పద్ధతులు చికిత్స సమయంలో మానసిక ప్రశాంతతకు, ఒత్తిడి తగ్గించుకోవడానికి ఉపయోగపడతాయి. అయితే, ఇవి క్యాన్సర్‌ను నయం చేసే చికిత్సలకు ప్రత్యామ్నాయాలు కావు. వీటిని కూడా వైద్యుల సలహా మేరకే అనుసరించాలి.
ఏదైనా ప్రత్యామ్నాయ చికిత్సను ఎంచుకునే ముందు దాని ఉద్దేశం ఏమిటో స్పష్టంగా తెలుసుకోవాలి. అది సాధారణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికా, వ్యాధి లక్షణాల నుంచి ఉపశమనం కలిగించడానికా, లేక క్యాన్సర్‌ను నయం చేస్తుందనే ఉద్దేశంతో ప్రచారం చేస్తున్నారా అన్నది పరిశీలించాలి. ఆ చికిత్సకు సంబంధించి శాస్త్రీయ పరిశోధనలు ఉన్నాయా? ప్రస్తుతం వాడుతున్న మందులతో ఏవైనా ప్రతిచర్యలు ఉంటాయా? దుష్ప్రభావాలు ఏమిటి? అనే విషయాలను వైద్యులను అడిగి తెలుసుకోవాలి. క్యాన్సర్‌ను కచ్చితంగా నయం చేస్తామని హామీ ఇచ్చే ప్రకటనలు, తక్షణమే పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాలని ఒత్తిడి చేసేవారు, వైద్యుల సలహా తీసుకోవద్దని చెప్పేవారి విషయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం. రోగులు తమ సందేహాలను వైద్యులతో స్వేచ్ఛగా చర్చించే వాతావరణం ఉండాలి. సూచిస్తున్న చికిత్స వెనుక కారణాలు, దాని వల్ల కలిగే ప్రయోజనాలు, పరిమితులు, దుష్ప్రభావాలను వైద్యులు స్పష్టంగా వివరించాలి. సరైన సమాచారం, శాస్త్రీయ అవగాహన, నమ్మకమైన వైద్య సలహా ద్వారానే తప్పుడు ప్రచారాన్ని గుర్తించి, సరైన చికిత్సకు దూరమయ్యే ప్రమాదాన్ని నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
