బావి వద్ద మరమ్మతుల సమయంలో గ్యాస్ లీక్‌.. అరకిలోమీటరు పరిధిలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు

కోనసీమ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం గెద్దాడ సమీపంలో చోటుచేసుకున్న గ్యాస్ లీకేజీ ఘటనపై ఓఎన్జీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మంగళవారం ఉదయం 5 గంటల సమయంలో బావి వద్ద మరమ్మతు పనులు చేపడుతుండగా గ్యాస్ లీకేజీ ప్రారంభమైనట్లు వెల్లడించింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది లీకేజీని అదుపు చేసేందుకు ‘వెల్ కంట్రోల్’ చర్యలు చేపట్టినట్లు తెలిపింది.

ఈ చర్యల్లో భాగంగా నర్సాపూర్ నుంచి అదనపు సిబ్బందితో పాటు అవసరమైన పరికరాలను రప్పించినట్లు పేర్కొంది. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా బావి చుట్టూ అరకిలోమీటరు పరిధిలో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వివరించింది. అలాగే జాతీయ రహదారి 216పై వాహనాల రాకపోకలను దారి మళ్లించినట్లు వెల్లడించింది.

గ్యాస్ లీకేజీ నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఓఎన్జీసీ తెలిపింది. బావి వద్ద మంటలు వ్యాపించకుండా వాటర్ బ్లాంకెట్ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ప్రస్తుతం బావి వద్ద, పరిసర ప్రాంతాల్లో గ్యాస్ సాంద్రత సున్నాగా నమోదవుతోందని సంస్థ స్పష్టం చేసింది.

జిల్లా, రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఓఎన్జీసీ వెల్లడించింది. గ్యాస్ లీకేజీ ఘటనపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భద్రతకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని ప్రకటనలో భరోసా ఇచ్చింది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *