
తిరుపతిలోని రేణిగుంట రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి హల్‌చల్ చేయడంతో కొద్దిసేపు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తిరువనంతపురం–న్యూఢిల్లీ కేరళ ఎక్స్‌ప్రెస్ నుంచి దిగిన వ్యక్తి ప్లాట్‌ఫాంపై కేకలు వేస్తూ రైలు పైకి ఎక్కాడు. అనంతరం హైటెన్షన్ విద్యుత్ వైర్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించాడు.
ప్రమాదాన్ని గుర్తించిన రైల్వే అధికారులు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఆ తర్వాత ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ, ఫైర్ సిబ్బంది సుమారు గంటపాటు శ్రమించి అతడిని సురక్షితంగా కిందకు దించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో కొద్దిసేపు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తనను అరెస్ట్ చేస్తే 48 గంటల్లో కోర్టులో హాజరుపరచాలని, త్రీ స్టార్ ఆఫీసర్ మాత్రమే రావాలని అంటూ సదరు వ్యక్తి హల్‌చల్ చేసినట్లు సమాచారం. అతడు మద్యం మత్తులో ఉన్నాడా లేదా మతిస్థిమితం సరిగా లేదా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
