
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి మీదుగా ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు కీలక సమాచారం. గూడూరు–రేణిగుంట–తిరుపతి రైల్వే సెక్షన్‌లో ఆధునికీకరణ పనులు చేపడుతున్న నేపథ్యంలో పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లించాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
రేణిగుంట జంక్షన్‌లో యార్డు రీ-మోడలింగ్, ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ పనులు నవంబర్ 10 నుంచి డిసెంబర్ 27 వరకు కొనసాగనున్నాయి. రైల్వే భద్రతను మెరుగుపరచడం, రైళ్ల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడం ఈ పనుల ప్రధాన ఉద్దేశం. ఈ మార్పుల కారణంగా తిరుపతికి వచ్చే భక్తులు, ఇతర ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను ముందుగానే సరిచూసుకోవాలని అధికారులు సూచించారు.
రద్దయిన రైళ్లు ఇవే..
- చెన్నై–తిరుపతి సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ను సుమారు 27 రోజుల పాటు రద్దు చేశారు.
- విశాఖపట్నం–తిరుపతి డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ డిసెంబర్ 9 నుంచి 26 వరకు అందుబాటులో ఉండదు.
- తిరుపతి–భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్‌ను డిసెంబర్ 12–14, 19–21, 26–27 తేదీల్లో రద్దు చేశారు.
- రేణిగుంట–మైసూరు ఎక్స్‌ప్రెస్‌ను డిసెంబర్ 11, 12, 18, 19, 25 తేదీల్లో రద్దు చేశారు.
వీటితో పాటు తిరుచానూరు–నాందేడ్, జల్నా, కాచిగూడ–చర్లపల్లి మార్గాల్లో నడిచే కొన్ని వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా నిర్దిష్ట తేదీల్లో రద్దయ్యాయి. కడప–అరక్కోణం, తిరుచానూరు–అరక్కోణం, చెన్నై–తిరుచానూరు, గూడూరు–రేణిగుంట, నెల్లూరు–రేణిగుంట ప్యాసింజర్ రైళ్లపైనా ప్రభావం పడనుంది.
50కి పైగా ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మార్గం మళ్లింపు
ముంబయి, హౌరా, ఢిల్లీ, కన్యాకుమారి, చెన్నై, తిరువనంతపురం, బెంగళూరు, మైసూరు తదితర ప్రాంతాల నుంచి రేణిగుంట మీదుగా రాకపోకలు సాగించే 50 నుంచి 73 వరకు ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లను ప్రత్యామ్నాయ మార్గాల్లో నడపనున్నారు.
కొన్ని రైళ్లను గుత్తి–అనంతపురం–ధర్మవరం మార్గంలో, మరికొన్నింటిని సూళ్లూరుపేట, అరక్కోణం, పెరంబూర్, కాట్పాడి, జోలార్‌పేట, కృష్ణరాజపురం మార్గాల్లో దారి మళ్లించనున్నారు.
మార్గం మళ్లించిన రైళ్లకు రేణిగుంటతో పాటు మధ్యలోని కొన్ని స్టేషన్లలో హాల్టులు ఉండవని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. కాబట్టి ప్రయాణికులు రైల్వే స్టేషన్‌కు బయలుదేరే ముందు తమ రైలు రాకపోకల వివరాలను అధికారిక వెబ్‌సైట్ లేదా NTES యాప్‌లో తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి.
