
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ మరో కీలక సౌకర్యాన్ని కల్పించనుంది. ధర్మరథం ఉచిత బస్సుల కోసం వేచి ఉండే భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని 21 ప్రాంతాల్లో ఆధునిక స్మార్ట్ బస్టాపులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటి నిర్మాణానికి ప్రముఖ రేమండ్స్ సంస్థ ముందుకొచ్చింది.
ప్రస్తుతం తిరుమలలో భక్తుల రవాణా కోసం 46 ఉచిత ధర్మరథం ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. అయితే బస్సుల కోసం వేచి ఉండే చోట సరైన వసతులు లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా స్మార్ట్ బస్ షెల్టర్లను నిర్మించనున్నారు.
బస్టాపుల్లో ఆధునిక సదుపాయాలు
కొత్త బస్టాపుల్లో కూర్చునేందుకు సీట్లు, బస్సుల రాకపోకల వివరాలు తెలిపే డిజిటల్ డిస్ప్లేలు, సీసీ కెమెరాలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నారు. అత్యవసర సమయాల్లో ఉపయోగపడే ఎస్‌వోఎస్ బటన్, ఫైర్ సేఫ్టీ పరికరాలు, ప్రథమ చికిత్స సదుపాయాలు కూడా కల్పించనున్నారు. సోలార్ ప్యానెల్స్, బ్యాటరీ బ్యాకప్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
వెంకటాద్రి యాప్‌తో అనుసంధానమైన క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీన్ని స్కాన్ చేస్తే బస్సు రూట్ మ్యాప్, రాక సమయం, ప్రయాణ వివరాలు తెలుసుకోవచ్చు.
మూడు దశల్లో నిర్మాణం
మొత్తం 21 బస్టాపులను మూడు దశల్లో అభివృద్ధి చేయనున్నారు. తొలుత రాంభగీచా, లేపాక్షి కూడలితో పాటు మరో ప్రాంతంలో పెద్ద బస్టాపులను ఏర్పాటు చేస్తారు. అనంతరం మిగిలిన వాటిని పూర్తి చేయనున్నారు. ఇప్పటికే టీటీడీ అధికారులు బస్టాప్ నమూనాను రేమండ్స్ సంస్థకు పంపించారు. ఇటీవల ఆ సంస్థ ప్రతినిధులు తిరుమలలోని బస్టాపులను పరిశీలించినట్లు సమాచారం.
ఒక్కో స్మార్ట్ బస్టాప్ నిర్మాణానికి రూ.22 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా. చెన్నైకి చెందిన మరో దాత కూడా ఈ ప్రాజెక్టుకు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ బస్టాపులు అందుబాటులోకి వస్తే భక్తులకు ఎండ, వాన నుంచి రక్షణతో పాటు బస్సుల సమాచారం సులభంగా తెలుసుకునే అవకాశం కలగనుంది.
