
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీకి అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి రాజీనామా చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, పార్టీకి గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏర్పాటు చేస్తున్న కొత్త పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. పార్టీలో సరైన సభ్యత్వ వ్యవస్థ లేదని, సంతకాలు లేని లెటర్ ప్యాడ్లపై పదవులు కేటాయిస్తున్నారని ఆరోపించారు. నాయకులకు, కార్యకర్తలకు తగిన గుర్తింపు లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌ను కలవాలంటే ముందుగా ఆయన చుట్టూ ఉన్న కోటరీని దాటుకుని వెళ్లాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు.
పార్టీ అధినేతకు, క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలకు మధ్య కోటరీ అడ్డుగోడగా మారిందని విమర్శించారు. సజ్జల రామకృష్ణారెడ్డిపై కూడా ఆయన ఆరోపణలు చేశారు. వైఎస్ జగన్ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారని వ్యాఖ్యానించారు. పార్టీ అంతర్గత పరిస్థితులు, నాయకత్వ వైఖరిపై అసంతృప్తితోనే రాజీనామా చేసినట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నారు. విజయవాడలోని ఏ1 ఫంక్షన్ హాల్‌లో ఉదయం 11:11 గంటలకు పార్టీని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. వివిధ జిల్లాల నుంచి పలువురు నాయకులు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని విజయభాస్కర్ రెడ్డి వెల్లడించారు. మాజీ టీటీడీ పాలకమండలి సభ్యుడు ఓవీ రమణ కొత్త పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగనున్నట్లు తెలిపారు.
వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసి విజయసాయిరెడ్డి కొత్త పార్టీలో చేరాలని అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
