Summer Holidays Movie Review: A Nostalgic Journey That Takes You Back to Your Childhood Memories

మామిడి తోటల్లో అల్లరి, చెరువుల్లో ఈతలు, స్నేహితులతో క్రికెట్ ఆటలు.. ఇలా వేసవి సెలవులు అనగానే ప్రతి ఒక్కరికీ తమ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. అలాంటి మధురమైన బాల్యాన్ని వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నమే ‘సమ్మర్ హాలిడేస్’. మాస్టర్ రోహన్ రాయ్, మాస్టర్ అరుణ్ దేవ్, బేబీ ఖుషి ప్రధాన పాత్రల్లో కొత్త దర్శకుడు శ్రీకర్ నయన్ జి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని నిర్మించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? పూర్తి రివ్యూలో చూద్దాం.

మూవీ వివరాలు

  • సినిమా: సమ్మర్ హాలిడేస్
  • నటీనటులు: రోహన్ రాయ్ గుంటి, అరుణ్ దేవ్, ఖుషి సోని, జయసుధ, రాజీవ్ కనకాల, హర్షవర్ధన్, వాసుకి తదితరులు
  • దర్శకత్వం: శ్రీకర్ నయన్ జి
  • సంగీతం: సింజిత్ యెర్రమిల్లి
  • సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్
  • ఎడిటింగ్: సంతోష్ నాయుడు
  • నిర్మాతలు: ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని

కథేంటంటే?

రావూరి వెంకటేష్ అలియాస్ ఆర్వీ (అరుణ్ దేవ్) చదువులో ఎప్పుడూ ముందుండాలని అతడి తండ్రి (హర్షవర్ధన్) కోరుకుంటుంటాడు. అందుకోసం కొడుకుపై కఠినమైన ఆంక్షలు విధిస్తుంటాడు. అయితే ఆర్వీకి మాత్రం పుస్తకాల ప్రపంచం నుంచి బయటపడి, బయటి ప్రపంచాన్ని చూడాలని ఆశ ఉంటుంది.

ఈ నేపథ్యంలో 2001 వేసవి సెలవుల్లో ఆర్వీ తల్లి జానకి (వాసుకి) అతడిని తోటవారిపాలెంలోని అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్తుంది. అక్కడ చదువుపై పెద్దగా ఆసక్తి లేని, డబ్బు సంపాదించి జీవితాన్ని ఆస్వాదించాలనుకునే కాశీ వెంకటేశ్వర్లు అలియాస్ కేవీ (రోహన్ రాయ్) పరిచయమవుతాడు.

ఇద్దరి ఆలోచనలు, స్వభావాలు పూర్తిగా భిన్నమైనప్పటికీ త్వరగానే మంచి స్నేహితులుగా మారతారు. ఆ తర్వాత వారి జీవితాల్లో చోటుచేసుకునే సంఘటనలు, స్నేహం, భావోద్వేగాల చుట్టూ సినిమా సాగుతుంది.

కథనం ఎలా ఉంది?

సినిమా ప్రారంభం నుంచే ప్రేక్షకులను అందమైన బాల్య జ్ఞాపకాల ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. చదువుల ఒత్తిడి, తండ్రి భయం మధ్య పెరిగే పట్నం కుర్రాడు.. వేసవి సెలవులు రాగానే అమ్మమ్మ ఊరికి వెళ్లాలని ఎదురుచూసే రోజులను దర్శకుడు చక్కగా చూపించారు.

ముఖ్యంగా ఫస్టాఫ్ 90వ దశకం నాటి పల్లెటూరి వాతావరణాన్ని గుర్తుచేస్తుంది. మామిడి తోటల్లో స్నేహితులతో అల్లరి చేయడం, చెరువుల్లో ఈత కొట్టడం, మండుటెండలో గల్లీ క్రికెట్ ఆడటం వంటి సన్నివేశాలు ప్రేక్షకులను తమ చిన్ననాటికి తీసుకెళ్తాయి. ఈ సన్నివేశాలను కథలో సహజంగా భాగం చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు.

చదువుపై ఆసక్తి లేని పల్లెటూరి కుర్రాడు కేవీ, బయటి ప్రపంచాన్ని చూడాలనుకునే పట్నం కుర్రాడు ఆర్వీ మధ్య స్నేహం చిగురించే విధానం ఆకట్టుకుంటుంది. ఇద్దరి భిన్నమైన మనస్తత్వాలు, వారి మధ్య ఏర్పడే అనుబంధం ఫస్టాఫ్‌కు ప్రధాన బలం.

అయితే ఇంటర్వెల్ తర్వాత కథనం కాస్త నెమ్మదిస్తుంది. సెకండాఫ్‌లో సన్నివేశాలు రొటీన్‌గా సాగడంతో తర్వాత ఏం జరుగుతుందో ప్రేక్షకులు సులభంగా ఊహించగలుగుతారు. కథలో కొత్త మలుపులు లేకపోవడం కొన్ని చోట్ల బోర్ కొట్టిస్తుంది. ప్రధాన పాత్రల మధ్య ఉండే భావోద్వేగ అనుబంధం మాత్రం సినిమాపై ఆసక్తిని కొంతవరకు నిలబెడుతుంది.

క్లైమాక్స్‌లో తడబాటు

సినిమాలో కొన్ని సన్నివేశాలు సహజత్వానికి దూరంగా అనిపిస్తాయి. ముఖ్యంగా మొదటి నుంచి కొడుకును చదువుల విషయంలో కఠినంగా నియంత్రించే తండ్రి పాత్ర.. చివర్లో కొడుకు చెప్పే ఒక్క డైలాగ్‌తో పూర్తిగా మారిపోవడం అంతగా కన్విన్సింగ్‌గా అనిపించదు.

ఏళ్ల తరబడి ఉన్న ఒక వ్యక్తి ఆలోచనా విధానం ఒక్కసారిగా మారిపోవడానికి సరైన కారణాన్ని దర్శకుడు బలంగా చూపించలేకపోయారు. అలాగే ఈ కథకు కీలకమైన క్లైమాక్స్ మరింత భావోద్వేగభరితంగా ఉండాల్సింది. ముగింపు సన్నివేశాలను ఇంకాస్త బలంగా తీర్చిదిద్ది ఉంటే సినిమా ప్రభావం మరింత పెరిగేది.

అయినప్పటికీ చిన్ననాటి స్నేహాలు, పల్లెటూరి వాతావరణం, బాల్యంలోని సరదా సంఘటనలు సినిమాను ఆసక్తిగా చూసేలా చేస్తాయి.

నటీనటుల పనితీరు

రోహన్ రాయ్ తన పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. అప్పటి దిగువ మధ్యతరగతి పిల్లల జీవనశైలి, వారి ఆలోచనలు, ఎదుర్కొనే పరిస్థితులను సహజమైన నటనతో చూపించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో మంచి పరిణతి ప్రదర్శించాడు.

ఆర్వీ పాత్రలో అరుణ్ దేవ్ కూడా ఆకట్టుకున్నాడు. తండ్రికి భయపడుతూనే స్నేహితుడికి అండగా నిలబడే కుర్రాడిగా చక్కగా నటించాడు. కేవీ ఎక్స్‌ట్రావర్ట్ అయితే, ఆర్వీ ఇంట్రోవర్ట్. ఈ ఇద్దరి విభిన్న స్వభావాలే వారి స్నేహానికి ప్రత్యేకతను తీసుకొచ్చాయి.

జయసుధ తక్కువ నిడివి ఉన్న పాత్రలోనూ తనదైన ముద్ర వేశారు. రాజీవ్ కనకాల కూడా తన పాత్రకు న్యాయం చేశారు. ఖుషి సోనీ, వాసుకి పాత్రలకు మరింత ప్రాధాన్యత ఇచ్చి ఉంటే బాగుండేది. ముఖ్యంగా వాసుకి పాత్రను ఇంకాస్త భావోద్వేగభరితంగా తీర్చిదిద్దాల్సింది. హర్షవర్ధన్ తన పాత్ర పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ విభాగం

సింజిత్ యెర్రమిల్లి అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కథలోని భావోద్వేగాలను మరింత బలంగా చూపించడంలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సహాయపడింది.

సాయి ప్రకాష్ సినిమాటోగ్రఫీ పల్లెటూరి అందాలను, ప్రకృతి దృశ్యాలను చక్కగా తెరపై ఆవిష్కరించింది. సంతోష్ నాయుడు ఎడిటింగ్ పర్వాలేదనిపిస్తుంది.

దర్శకుడు శ్రీకర్ నయన్ జి పాత కథాంశాన్నే ఎంచుకున్నప్పటికీ, దాన్ని ఒక అందమైన బాల్య జ్ఞాపకాల ప్రయాణంగా తెరకెక్కించే ప్రయత్నం చేశారు. ప్రధాన పాత్రల మధ్య స్నేహాన్ని, అప్పటి వాతావరణాన్ని బాగా చూపించారు. నిర్మాణ విలువలు కూడా సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్

  • చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే సన్నివేశాలు
  • పల్లెటూరి వాతావరణం
  • రోహన్ రాయ్, అరుణ్ దేవ్ నటన
  • ప్రధాన పాత్రల మధ్య స్నేహం
  • సంగీతం, సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్

  • సెకండాఫ్‌లో నెమ్మదించిన కథనం
  • ఊహించగలిగే సన్నివేశాలు
  • కొన్ని లాజిక్‌కు దూరంగా అనిపించే సన్నివేశాలు
  • అంతగా ఆకట్టుకోని క్లైమాక్స్

ఫైనల్‌గా..

‘సమ్మర్ హాలిడేస్’ ఒక అందమైన బాల్య జ్ఞాపకాల ప్రయాణం. ముఖ్యంగా 90వ దశకం నాటి పల్లెటూరి వాతావరణం, స్నేహితులతో గడిపిన వేసవి సెలవులు గుర్తుకొచ్చేలా చేస్తుంది. కథనం, క్లైమాక్స్ విషయంలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, ప్రధాన పాత్రల నటన, భావోద్వేగాలు సినిమాను ఒక డీసెంట్ ఫ్యామిలీ డ్రామాగా నిలబెట్టాయి. బాల్య జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేసుకోవాలనుకునేవారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది.

Live Updates in DTV Digital

మొత్తంగా.. ‘సమ్మర్ హాలిడేస్’ ఒకసారి చూడదగిన డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.