కలుషితమైన గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తులు, గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా శ్వాసనాళాల్లో చికాకు, వాపు ఏర్పడి శ్వాస సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. అంతేకాకుండా ఆస్తమా, దీర్ఘకాలిక బ్రాంకైటిస్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) వంటి దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు కూడా పెరుగుతుంది.

అతి త్వరలో దీపావళి పండగ రానుంది. ఈ నేపథ్యంలో గత ఏడాదితో పోలిస్తే ఈసారి టపాసుల వినియోగం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా వాయు కాలుష్యం తీవ్రత కూడా పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే దేశంలోని పలు ప్రధాన నగరాల్లో గాలి నాణ్యత రోజురోజుకూ పడిపోతోంది. ముఖ్యంగా ఢిల్లీలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
కలుషిత గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తులు, గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. శ్వాసనాళాల్లో చికాకు, వాపు ఏర్పడటంతో పాటు ఆస్తమా, దీర్ఘకాలిక బ్రాంకైటిస్, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) వంటి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అంతేకాదు, కలుషిత గాలిలోని హానికర వాయువులు, సూక్ష్మ ధూళి కణాల ప్రభావంతో ఆరోగ్యంగా ఉన్నవారు సైతం శ్వాస సంబంధిత ఇబ్బందులకు గురవుతారు. ఈ నేపథ్యంలో వాయు కాలుష్యం నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఎయిర్ ఫిల్టర్‌ను ఉపయోగించండి
బయటి గాలితో పోలిస్తే ఇంటి లోపలి గాలి 2 నుంచి 5 రెట్లు ఎక్కువగా కలుషితమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇంట్లో గాలి నాణ్యతను మెరుగుపరచడానికి హై ఎఫిషియెన్సీ పార్టిక్యులేట్ ఎయిర్ (HEPA) ఫిల్టర్‌ను ఉపయోగించండి. ఇది గాలిలోని అతి సూక్ష్మమైన కాలుష్య కణాలను సైతం సమర్థంగా తొలగిస్తుంది.
దోమల కాయిల్స్‌కు దూరంగా ఉండండి
ఒక్క దోమల కాయిల్ వెలువరించే సూక్ష్మ కాలుష్య కణాలు 75 నుంచి 100 సిగరెట్ల పొగతో సమానంగా ఉండవచ్చు. అగరబత్తుల పొగ కూడా గాలి నాణ్యతను దెబ్బతీస్తుంది. అందువల్ల వీటి వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించండి.
శ్వాస సంబంధిత సమస్యలుంటే జాగ్రత్త
ఆస్తమా వంటి శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారు తమకు అవసరమైన ఇన్హేలర్లను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి. వాయు కాలుష్యం అధికంగా ఉన్నప్పుడు వైద్యులు సూచించిన మందులు, జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలి.
మాస్క్ ధరించడం మర్చిపోవద్దు
వాయు కాలుష్యం పెరిగినప్పుడు బయటకు వెళ్లాల్సి వస్తే మాస్క్ ధరించడం ముఖ్యం. సాధారణ సర్జికల్ మాస్క్‌లు సూక్ష్మ కాలుష్య కణాల నుంచి తగిన రక్షణ ఇవ్వలేవు. అందువల్ల వాటికి బదులుగా సరైన ఫిట్‌తో కూడిన ఎన్95 (N95) మాస్క్‌ను ఉపయోగించండి.
తగినంత నీరు తాగండి
శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడం ముఖ్యం. తగినంత నీరు తాగడం వల్ల శ్వాసనాళాల సహజ రక్షణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి తోడ్పడుతుంది. నీటితో పాటు కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలను కూడా తీసుకోవచ్చు.
కాలుష్యం ఎక్కువగా ఉండే సమయాల్లో బయటకు వెళ్లకండి
సాధారణంగా తెల్లవారుజామున, సాయంత్రం వేళల్లో కొన్ని ప్రాంతాల్లో వాయు కాలుష్యం ఎక్కువగా ఉండవచ్చు. కాబట్టి ఈ సమయాల్లో బయటకు వెళ్లడాన్ని తగ్గించండి. అత్యవసరమైతే మాత్రమే బయటకు వెళ్లి, వీలైనంత తక్కువ సమయం గడపండి. ఇలా చేయడం ద్వారా కాలుష్యానికి గురయ్యే అవకాశాన్ని తగ్గించుకోవచ్చు.
