
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి జంటగా సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి’ అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
షూటింగ్ పూర్తైన సందర్భంగా కౌంట్‌డౌన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దాదాపు 130 రోజుల పాటు విరామం లేకుండా చిత్రబృందం సినిమాపై పనిచేసిందని తెలిపారు. మరో 29 రోజుల్లో ‘రణబాలి’ థియేటర్లలోకి రానుందని పేర్కొన్నారు.
1870ల నేపథ్యంతో కథ
విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్‌లో గతంలో ‘టాక్సీవాలా’ సినిమా వచ్చింది. ఇప్పుడు వీరిద్దరి కలయికలో రూపొందుతున్న రెండో చిత్రం ‘రణబాలి’. ఈ సినిమాలో విజయ్ ఓ తిరుగుబాటు యోధుడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
కథ 1870 ప్రాంతంలో సాగుతుందని, పాత్రకు తగ్గ ఫిజిక్ ఉన్న హీరో కోసం విజయ్‌ను ఎంపిక చేసినట్లు దర్శకుడు గతంలో వెల్లడించారు. ఇక హీరోయిన్ పాత్ర కోసం పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉన్న నటి కావాలని భావించి రష్మికను ఎంపిక చేసినట్లు తెలిపారు.
వాస్తవ ఘటనల ఆధారంగా..
1854 నుంచి 1878 మధ్య చోటుచేసుకున్న కొన్ని వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ‘రణబాలి’పై ఇప్పటికే అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ పూర్తవడంతో ఇక ప్రమోషన్స్‌పై టీమ్ దృష్టి పెట్టనుంది.
