దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక పాన్ వరల్డ్ చిత్రం ‘వారణాసి’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న ఈ మూవీ 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఓ ప్రత్యేక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న పృథ్వీరాజ్.. ‘వారణాసి’లో తన పాత్ర, రాజమౌళి వర్కింగ్ స్టైల్, మహేష్ బాబు, ప్రియాంక చోప్రాలతో కలిసి పనిచేసిన అనుభవం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

కుంభ పాత్ర చాలా ఛాలెంజింగ్

‘వారణాసి’లో తాను పోషిస్తున్న కుంభ పాత్ర శారీరకంగా ఎంతో సవాలుగా ఉంటుందని పృథ్వీరాజ్ తెలిపారు. ఈ పాత్రకు శారీరక వైకల్యం ఉండటంతో చేతులు, కాళ్లను ఒకే పొజిషన్‌లో ఉంచినట్లుగా నటించాల్సి వచ్చిందన్నారు.

అలాంటి పరిమితులతోనే భారీ యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనడం చాలా కష్టంగా అనిపించిందని, అయితే తనకు ఇది పూర్తిగా కొత్త అనుభవాన్ని ఇచ్చిందని చెప్పారు. సినిమాలో కుంభ పాత్ర చాలా శక్తివంతంగా ఉంటుందని పృథ్వీరాజ్ పేర్కొన్నారు.

నటులపై రాజమౌళి ప్రత్యేక ఫోకస్

రాజమౌళి దర్శకత్వ శైలిని కూడా పృథ్వీరాజ్ ప్రశంసించారు. భారీ సెట్లు, యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నప్పటికీ షూటింగ్ సమయంలో రాజమౌళి నటుల పెర్ఫార్మెన్స్‌పై, ముఖ్యంగా క్లోజప్ షాట్లపై ప్రత్యేక దృష్టి పెడతారని చెప్పారు.

సెట్లో నటులకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తారని, తనకు నచ్చే వరకు సన్నివేశాలను మళ్లీ మళ్లీ తెరకెక్కిస్తూ నటుల నుంచి బెస్ట్ పెర్ఫార్మెన్స్ రాబడతారని వివరించారు. జక్కన్నతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

మహేష్, ప్రియాంకతో కలిసి నటించడం ప్రత్యేక అనుభవం

మహేష్ బాబు, ప్రియాంక చోప్రాలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం తనకు గొప్ప అనుభూతి అని పృథ్వీరాజ్ చెప్పారు. మహేష్ తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర కథానాయకుల్లో ఒకరని, ప్రియాంకకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని అన్నారు.

అయితే రాజమౌళి సెట్లో స్టార్ ఇమేజ్ కంటే కథ, పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. తాను ఓ సినిమా దర్శకత్వం వహిస్తున్న సమయంలో రాజమౌళి నుంచి మెసేజ్ వచ్చిందని, హైదరాబాద్‌కు వచ్చి కథ విన్న తర్వాత సినిమా స్కేల్ తాను ఊహించిన దానికంటే చాలా పెద్దదిగా ఉందని అర్థమైందని చెప్పారు.

నెగెటివ్ పాత్రల్లో నటించడం ఇష్టం

‘వారణాసి’ కథ క్రీస్తుపూర్వం 7000 సంవత్సరం నుంచి 2027 వరకు విస్తరించి ఉంటుందని పృథ్వీరాజ్ తెలిపారు. ఇంత భారీ టైమ్‌లైన్, అడ్వెంచర్ స్కేల్‌తో వస్తున్న ఈ చిత్రం భారతీయ సినిమాలో కొత్త తరహా జానర్‌ను పరిచయం చేస్తుందని అన్నారు.

మలయాళ చిత్ర పరిశ్రమలో గ్రే, నెగెటివ్, పాజిటివ్ పాత్రలు చేయడం నటులకు కొత్త కాదని చెప్పిన పృథ్వీరాజ్.. ముఖ్యంగా బ్యాడ్ గై పాత్రలో నటించడం తనకు ప్రత్యేకమైన కిక్ ఇస్తుందని వెల్లడించారు.

‘వారణాసి’లో కుంభగా పృథ్వీరాజ్ ఎలా కనిపించబోతున్నారనేది ఇప్పటికే ఆసక్తిని పెంచుతోంది. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండటంతో ఈ పాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *