ప్రస్తుతం ఎక్కడ చూసినా వినాయక చవితి సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సాధారణంగా అన్నదానంలో మూడు నుంచి ఐదు రకాల కూరలు, వంటకాలు ఉండేలా చూస్తారు. వాటిలో సాంబార్ రైస్‌ కూడా ప్రత్యేకంగా నిలుస్తుంది.

వినాయకుడి అన్నదానంలో సుమారు 1000 మందికి సరిపడేలా సాంబార్ రైస్‌ తయారు చేయాలంటే ఎంతెంత పరిమాణంలో పదార్థాలు తీసుకోవాలి? రుచిగా, అందరికీ సరిపోయేలా ఎలా తయారు చేయాలి? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కొలతల ప్రకారం తయారు చేస్తే రుచికరమైన సాంబార్ రైస్‌ను పెద్ద సంఖ్యలో భక్తులకు వడ్డించవచ్చు.

1000 మందికి సాంబార్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు:
బియ్యం 65 కిలోలు, కందిపప్పు 20 కిలోలు, మిశ్రమ కూరగాయలు 70 కిలోలు (బంగాళదుంపలు, సొరకాయ, ముల్లంగి, వంకాయ, క్యారెట్, మునక్కాయలు), ఉల్లిపాయలు 12 కిలోలు, టమాటాలు 15 కిలోలు, చింతపండు 5 కిలోలు, సాంబార్ పొడి 3 కిలోలు, నూనె 5 కిలోలు, నెయ్యి 2 కిలోలు, ఆవాలు 250 గ్రాములు, జీలకర్ర 250 గ్రాములు, మినపప్పు 250 గ్రాములు, ఎండుమిర్చి 200 గ్రాములు, పచ్చిమిర్చి 1 కిలో, ఇంగువ 100 గ్రాములు, పసుపు 250 గ్రాములు, కరివేపాకు అర కిలో, కొత్తిమీర 2 కిలోలు, ఉప్పు రుచికి సరిపడా తీసుకోవాలి.

తయారీ విధానం:
ముందుగా బియ్యం, కందిపప్పును శుభ్రంగా కడిగి తగినంత నీరు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత పప్పు, బియ్యం మరీ మెత్తగా ముద్ద కాకుండా పెద్ద గరిటెతో మెల్లగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మరోవైపు చింతపండును నీటిలో నానబెట్టి రసం తీసి సిద్ధంగా ఉంచుకోవాలి. కూరగాయలను ముక్కలుగా కోసి పక్కన పెట్టాలి.

తర్వాత పెద్ద కళాయిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి తాలింపు పెట్టాలి. ఇందులో దంచిన వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఇంగువ వేసి వేయించాలి. అనంతరం కరివేపాకు వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి.

ఇప్పుడు టమాటా ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు వేసి ఉప్పు, పసుపు కలపాలి. మీడియం మంటపై కొన్ని నిమిషాలు వేయించిన తర్వాత సాంబార్ పొడి వేసి కలపాలి. అనంతరం చింతపండు రసం, తగినంత నీరు పోసి రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి కూరగాయలు మెత్తగా ఉడికే వరకు మరిగించాలి.

కూరగాయలు ఉడికిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పప్పు-బియ్యం మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. ఈ సమయంలో మంటను తగ్గించి, సాంబార్ మిశ్రమం అన్నంతో పూర్తిగా కలిసేలా జాగ్రత్తగా కలపాలి. సాంబార్ రైస్ గట్టిగా అనిపిస్తే కొద్దిగా వేడి నీరు కలుపుకోవచ్చు. అనంతరం మూత పెట్టి తక్కువ మంటపై మరికొద్దిసేపు ఉడికించాలి.

చివరగా స్టవ్ ఆఫ్ చేసి సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలపాలి. వేడివేడిగా వడ్డించే సమయంలో కొద్దిగా నెయ్యి వేస్తే రుచి మరింత పెరుగుతుంది. కావాలనుకుంటే నెయ్యిలో ఎండుమిర్చి, కరివేపాకు, జీడిపప్పు వేయించి తాలింపుగా పైన వేసుకోవచ్చు. ఇలా తయారు చేస్తే అన్నదానంలో 1000 మందికి సరిపడే కమ్మటి సాంబార్ రైస్ సిద్ధమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *