
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో చేసిన మార్పు చర్చనీయాంశంగా మారింది. సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కంటే ముందుగా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను బ్యాటింగ్‌కు పంపించింది భారత జట్టు మేనేజ్మెంట్. అయితే ఈ ప్రయోగం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అక్షర్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఈ నిర్ణయంపై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. కేఎల్ రాహుల్ కంటే అక్షర్‌ను ముందుగా పంపాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు.
గంభీర్, గిల్ వ్యూహానికి గావస్కర్ మద్దతు
అశ్విన్ అభిప్రాయానికి భిన్నంగా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ భారత జట్టు నిర్ణయాన్ని సమర్థించారు. బ్యాటింగ్ ఆర్డర్లో ఎడమచేతి వాటం బ్యాటర్‌ను ముందుగా పంపడం మంచి వ్యూహమని పేర్కొన్నారు. కుడి, ఎడమ చేతి బ్యాటర్ల కలయిక ప్రత్యర్థి బౌలర్లకు సవాలుగా మారుతుందని వివరించారు.
పరిస్థితులను బట్టి ప్రయోగాలు అవసరం
కుడి, ఎడమ చేతి బ్యాటర్లు వరుసగా క్రీజులో ఉంటే బౌలర్లు తమ లైన్, లెంగ్త్‌లను తరచూ మార్చుకోవాల్సి వస్తుందని గావస్కర్ విశ్లేషించారు. దీనివల్ల బ్యాటర్లకు పరుగులు సాధించే అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.
అక్షర్ పటేల్ మరికొన్ని పరుగులు చేసి ఉంటే ఇదే నిర్ణయంపై కెప్టెన్సీని ప్రశంసించేవారని వ్యాఖ్యానించారు. క్రికెట్లో కొన్ని వ్యూహాలు విజయవంతమవుతాయని, మరికొన్ని సందర్భాల్లో ఆశించిన ఫలితాలు రావని అభిప్రాయపడ్డారు. కేఎల్ రాహుల్ వంటి అనుభవజ్ఞుడైన బ్యాటర్ తర్వాతి స్థానంలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేయడంలో తప్పేమీ లేదని గావస్కర్ స్పష్టం చేశారు.
