హైదరాబాద్‌లో నిర్వహించిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) నాలుగో ఇన్‌సైట్స్ ఫోరంలో ఏఐ వినియోగం, సంస్థల్లో మానవ వనరుల ప్రాధాన్యంపై ఆసక్తికర చర్చ జరిగింది. కృత్రిమ మేధ (ఏఐ) వేగంగా విస్తరిస్తున్నప్పటికీ.. సంస్థల నిర్వహణలో మనుషుల పాత్ర ఎప్పటికీ కీలకంగానే ఉంటుందని ఇన్సీడ్ ప్రొఫెసర్ ఫణీష్ పురాణం స్పష్టం చేశారు. యంత్రాలు గుర్తించలేని తప్పులను మనుషులు గుర్తించగలరని, తీసుకునే నిర్ణయాలకు బాధ్యత వహించే సామర్థ్యం మానవులకే ఉంటుందని వివరించారు.

ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచేందుకు, బృందాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచేందుకు ఏఐని ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. ఏఐని కేవలం ఒక సాంకేతిక సాధనంగా కాకుండా.. సంస్థల పని విధానాల్లో భాగంగా పరిగణించి తగిన మార్పులు చేసుకోవాలని పేర్కొన్నారు. కొత్త ప్రయోగాలు చేయడం, వాటి ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకోవడం, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పనిచేయడం ద్వారా ఉద్యోగుల నైపుణ్యాలు పెరుగుతాయని తెలిపారు. దీనివల్ల బాధ్యతాయుతమైన పని సంస్కృతి కూడా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు.

స్థానిక సమస్యలకు అంతర్జాతీయ పరిష్కారాలపై చర్చ

వ్యాపారం, ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యం, మహిళా సాధికారత, ప్రభుత్వ విధానాలు తదితర అంశాలపై ఈ ఫోరంలో చర్చించారు. స్థానిక అవసరాలు, సమస్యలకు అనుగుణంగా పరిశోధనలు చేపడుతూనే.. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలను వాటితో అనుసంధానించడంపై వక్తలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా ది కన్వర్జెన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్‌పర్సన్ ఆశిష్ ధావన్‌కు ఐఎస్బీ రీసెర్చ్ క్యాటలిస్ట్ అవార్డును అందజేశారు.

నాణ్యమైన పరిశోధనలతోనే మార్పు

ఐఎస్బీ డీన్ ప్రొఫెసర్ మదన్ పిల్లుట్ల మాట్లాడుతూ.. భారతదేశంలోని సమస్యలను అంతర్జాతీయ ప్రమాణాలతో పరిశోధించాలనే లక్ష్యంతోనే ఐఎస్బీ ఏర్పాటైందని గుర్తుచేశారు. పరిశోధనల్లో వెలువడే అంశాలను విధాన నిర్ణేతలతో పంచుకోవడంతో పాటు, భవిష్యత్తులో పరిశోధకులు ఏయే సమస్యలపై దృష్టి పెట్టాలనే విషయాన్ని తెలుసుకునేందుకు ఇలాంటి సమావేశాలు ఉపయోగపడతాయని చెప్పారు.

పరిశోధనలు కచ్చితమైన ఆధారాలతో సాగాలని, వాటి ఫలితాలు కేవలం పత్రాలకే పరిమితం కాకుండా ఆచరణలోనూ ఉపయోగపడాలని ఐఎస్బీ డిప్యూటీ డీన్ ప్రొఫెసర్ కార్తీక్ బాలకృష్ణన్ పేర్కొన్నారు. సమాజానికి, విధాన రూపకల్పనకు ఉపయోగపడే నాణ్యమైన పరిశోధనలే ముఖ్యమని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *