అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు గరిష్ఠ వయోపరిమితిని పెంచుతూ రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది.

నాన్-యూనిఫాం ప్రభుత్వ ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాలకు ప్రస్తుతం ఉన్న గరిష్ఠ వయోపరిమితిని 34 నుంచి 44 ఏళ్లకు పెంచారు. ఈ ప్రత్యేక సడలింపు 2027 సెప్టెంబర్ 30 వరకు విడుదల చేసే ఉద్యోగ నోటిఫికేషన్లకు మాత్రమే వర్తిస్తుంది.

అదేవిధంగా యూనిఫాం సర్వీసుల్లో సాధారణ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితిని రెండేళ్ల పాటు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే పోలీస్, ఎక్సైజ్, ఫైర్, జైళ్లు, అటవీ, రవాణా శాఖల్లోని యూనిఫాం పోస్టులతో పాటు భౌతిక ప్రమాణాలు తప్పనిసరి అయిన పోస్టులకు ఈ ప్రత్యేక సడలింపు వర్తించదు.

ఇప్పటికే ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్, 1996లోని రూల్ 12 ప్రకారం వివిధ వర్గాలకు అందుతున్న వయోపరిమితి సడలింపులు యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు వర్తించే రిజర్వేషన్ నిబంధనలు కూడా కొనసాగనున్నాయి.

చాలాకాలంగా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు వయోపరిమితి పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో అధికారులతో చర్చించిన ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. వయోపరిమితి పెంపుపై నిరుద్యోగ యువత హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *