ఆంధ్రప్రదేశ్‌లో భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) ఏర్పాటు చేయనున్న గ్రీన్‌ఫీల్డ్‌ ఆయిల్‌ రిఫైనరీ, పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ప్రాజెక్టుకు సంబంధించి కీలక ముందడుగు పడింది. బీపీసీఎల్‌ సీఎండీ సంజయ్‌ ఖన్నా, ఇతర అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి ప్రాజెక్టు పురోగతిపై చర్చించారు. పనులను త్వరగా ప్రారంభించాలని సీఎం సూచించారు.

నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు సమీపంలో ఏర్పాటు చేయనున్న ఈ ప్రాజెక్టు కోసం కేటాయించిన 6 వేల ఎకరాల్లో ఇప్పటికే 75 శాతం భూమిని అప్పగించినట్లు సీఎం తెలిపారు. మిగిలిన భూమిని అక్టోబర్‌లోగా అప్పగిస్తామని చెప్పారు. రిఫైనరీకి సమీపంలో 1,500 ఎకరాల్లో డౌన్‌స్ట్రీమ్‌ పెట్రో కెమికల్‌ పార్క్‌ను ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రతిపాదించారు. ఇందుకోసం ఏపీఐఐసీ, బీపీసీఎల్‌ కలిసి ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

సెప్టెంబరు చివరి నాటికి ప్రాజెక్టుకు తుది పర్యావరణ అనుమతులు వచ్చే అవకాశం ఉందని బీపీసీఎల్‌ సీఎండీ తెలిపారు. ఇంజినీరింగ్‌ ఇండియా లిమిటెడ్‌ అధ్యయన నివేదిక వచ్చిన తర్వాత అక్టోబర్‌లో తుది పెట్టుబడి వ్యయాన్ని ఖరారు చేసి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.

ప్రస్తుతం ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.1.45 లక్షల కోట్లకు చేరిందని తెలిపారు. ఏడాదికి 9 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో రిఫైనరీని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో మోటార్‌ స్పిరిట్‌, హై-స్పీడ్‌ డీజిల్‌, ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ వంటి యూరో-6 ప్రమాణాల ఇంధనాలను ఉత్పత్తి చేయడంతో పాటు హెచ్‌డీపీఈ, ఎల్‌డీపీఈ, ఎల్‌ఎల్‌డీపీఈ, పాలిప్రొపైలీన్‌, పాలివినైల్‌ క్లోరైడ్‌ తదితర డౌన్‌స్ట్రీమ్‌ ఉత్పత్తులను కూడా తయారు చేయనున్నారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *