
ఆంధ్రప్రదేశ్ పోలీస్‌శాఖలో 2,050 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో.. అగ్నిమాపకశాఖలో డ్రైవర్ ఆపరేటర్ పోస్టులకు సంబంధించి హోంశాఖ కీలక మార్పులు చేసింది. ఈ పోస్టులకు ఇకపై దేహదారుఢ్య పరీక్షలతో పాటు రాతపరీక్ష కూడా నిర్వహించనున్నారు.
గతంలో డ్రైవర్ ఆపరేటర్ పోస్టులకు ఫిజికల్ మెజర్మెంట్, డ్రైవింగ్ టెస్ట్ మాత్రమే ఉండేది. తాజా నిబంధనల ప్రకారం ముందుగా అభ్యర్థులకు శారీరక కొలతల పరీక్ష నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించినవారికి పీఈటీ కింద 10 నిమిషాల్లోపు 1,600 మీటర్ల పరుగు పరీక్ష ఉంటుంది.
రన్నింగ్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు డ్రైవింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులోనూ అర్హత పొందినవారికి మూడు గంటల రాతపరీక్ష ఉంటుంది. ఈ మేరకు నిబంధనలను మారుస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు.
అగ్నిమాపకశాఖలో 147 డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. అభ్యర్థులు కొత్త ఎంపిక విధానాన్ని గమనించి సిద్ధం కావాల్సి ఉంటుంది.
