
కాకినాడ జిల్లా కరపలోని కాశీ వారాహి అమ్మవారి ఆలయాన్ని దేవాదాయ శాఖ తన ఆధీనంలోకి తీసుకుంది. సర్పవరం భావనారాయణ స్వామి ఆలయం గ్రేడ్-1 ఈవో రాపాక శ్రీనివాస్‌ను ఆలయ సింగిల్ ట్రస్టీగా నియమించింది. అనంతరం ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించి, ఆలయ హుండీలకు అధికారులు సీల్ వేశారు. రసీదు పుస్తకాలను స్వాధీనం చేయాలని ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబుకు నోటీసులు జారీ చేశారు.
ఆలయానికి భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో నిధుల వినియోగంపై కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌కు ఫిర్యాదులు అందాయి. దీంతో విచారణ కోసం కమిటీని ఏర్పాటు చేయగా.. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలోని అధికారులు ఆలయాన్ని పరిశీలించారు. అనంతరం ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకోవాలని నిర్ణయించారు.
కాగా, ఆలయాన్ని దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకోవడంపై జనసేన పార్టీ సీనియర్ నేత చిక్కాల దొరబాబు భావోద్వేగానికి గురయ్యారు. తన సొంత స్థలంలో, సొంత నిధులతో ఆలయాన్ని నిర్మించి అభివృద్ధి చేశానని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆలయం కోసం ఇప్పటివరకు కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. దీంతో అక్కడున్న భక్తులు ఆయనను ఓదార్చారు.
దొరబాబు సొంత నిధులతో సుమారు ఆరు నెలల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించారు. తక్కువ సమయంలోనే ఆలయానికి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు రావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం రాజమహేంద్రవరం, రావులపాలెం నుంచి కరపకు ఆర్టీసీ బస్సులను కూడా నడుపుతోంది.
