ముంబైలోని ప్రముఖ ఫైవ్‌స్టార్ హోటల్ జేడబ్ల్యూ మారియట్‌లో డైనింగ్ టేబుల్‌పై బొద్దింక కనిపించడంతో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ అశోక్ సేథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశీ ప్రతినిధులతో కలిసి భోజనానికి వెళ్లిన ఆయన, టేబుల్‌పై బొద్దింక తిరుగుతుండటాన్ని చూసి భోజనం చేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు.

హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన డాక్టర్ అశోక్ సేథ్.. ఇలాంటి ఘటనలు దేశ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తాయని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఆహార భద్రత కమిషనర్ తుకారాం ముండే, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐకి సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం హోటల్‌లో బొద్దింక కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దేశంలోని ప్రముఖ లగ్జరీ హోటళ్లలో ఆహార పరిశుభ్రత, నాణ్యతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముంబైలోని ఓ ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్‌లో ప్రముఖ కార్డియాలజిస్ట్, ఫోర్టిస్ హెల్త్‌కేర్ ఛైర్మన్ డాక్టర్ అశోక్ సేథ్‌కు చేదు అనుభవం ఎదురైంది.

తనకు నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేసుకుని తింటుండగా.. ఒక్కసారిగా డైనింగ్ టేబుల్‌పై బొద్దింక పరుగులు తీయడం చూసి ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. దీంతో వెంటనే భోజనం మధ్యలోనే ఆపేసిన డాక్టర్ అశోక్ సేథ్.. టేబుల్‌పై తిరుగుతున్న బొద్దింకను వీడియో తీశారు.

అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హోటల్ యాజమాన్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫైవ్ స్టార్ హోటల్‌లోనే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంపై వ్యంగ్యంగా స్పందిస్తూ.. ఆహార పరిశుభ్రతపై ప్రశ్నలు లేవనెత్తారు.

అంతేకాకుండా ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఐఏఎస్ అధికారి తుకారం ముండేను ట్యాగ్ చేస్తూ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం డాక్టర్ అశోక్ సేథ్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై హోటల్ యాజమాన్యం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

ముంబై సహార్‌లోని జేడబ్ల్యూ మారియట్ హోటల్‌లో శనివారం రాత్రి డిన్నర్ చేస్తుండగా డాక్టర్ అశోక్ సేథ్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. హోటల్‌లోని ‘రొమానో’ రెస్టారెంట్‌లో టేబుల్‌పై వడ్డించిన వంటకాల మధ్య ఓ చిన్న బొద్దింక తిరుగుతూ కనిపించింది.

దాన్ని గమనించిన డాక్టర్ అశోక్ సేథ్ వెంటనే వీడియో తీశారు. అనంతరం భోజనం చేయడం ఆపేసి, ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

“శనివారం రాత్రి జేడబ్ల్యూ మారియట్‌లో మా భోజనాన్ని పంచుకోవడానికి ఓ చిన్న బొద్దింక ఊహించని అతిథిగా మా టేబుల్ వద్దకు వచ్చింది. మేము ఎంత చెప్పినా అది వెళ్లకుండా మొండికేసింది. బహుశా దానికి పాస్తా నచ్చక, పిజ్జా కావాలని ఆశపడిందేమో” అంటూ ఆయన వ్యంగ్యంగా స్పందించారు.

బొద్దింకను చూసిన తర్వాత తమకు భోజనం చేయాలనే ఆసక్తి పూర్తిగా పోయిందని డాక్టర్ తెలిపారు. దీంతో సగం తిన్న ఆహారాన్ని అక్కడే వదిలేసి రెస్టారెంట్‌ నుంచి బయటకు వచ్చామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *