బంగాళాదుంపలను తరిగి కొద్దిసేపు బయట ఉంచితే అవి నెమ్మదిగా నల్లగా లేదా గోధుమ రంగులోకి మారడం సహజమే. గాలిలోని ఆక్సిజన్‌తో బంగాళాదుంపలోని కొన్ని పదార్థాలు ప్రతిచర్యకు గురికావడం వల్ల ఈ రంగు మార్పు జరుగుతుంది. సాధారణంగా ఇలా రంగు మారిన బంగాళాదుంపలు తినడానికి సురక్షితంగానే ఉంటాయి. అయితే వంటకాల్లో వాటి రూపం అంతగా ఆకర్షణీయంగా కనిపించదు. బంగాళాదుంపలు తరిగిన తర్వాత కూడా తాజాగా, సహజ రంగులో ఉండేలా చేసేందుకు కొన్ని సులభమైన కిచెన్ టిప్స్ పాటించవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

మన వంటింట్లో నిత్యం ఉపయోగించే కూరగాయల్లో బంగాళాదుంపకు ప్రత్యేక స్థానం ఉంది. స్నాక్స్ నుంచి కూరలు, ఫ్రైలు వరకు ఎన్నో రకాల వంటకాల్లో దీనిని ఉపయోగిస్తుంటాం. వంట సమయం తగ్గించుకునేందుకు చాలామంది బంగాళాదుంపలను ముందుగానే తొక్క తీసి, ముక్కలుగా కోసి పక్కన పెడుతుంటారు. అయితే కొద్దిసేపటికే ఆ ముక్కలు నల్లగా లేదా గోధుమ రంగులోకి మారడం కనిపిస్తుంది. ఇలా రంగు మారినంత మాత్రాన బంగాళాదుంపలు పాడైపోయాయని భావించాల్సిన అవసరం లేదు. అయితే రంగు మారడం వల్ల అవి చూడటానికి అంత తాజాగా కనిపించవు.
బంగాళాదుంపలు నల్లగా ఎందుకు మారతాయి?
బంగాళాదుంప ముక్కలు నల్లగా లేదా గోధుమ రంగులోకి మారడానికి ప్రధాన కారణం ఆక్సిడేషన్. బంగాళాదుంపను కోసినప్పుడు దాని లోపలి భాగం గాలిలోని ఆక్సిజన్‌కు ఎక్కువగా గురవుతుంది. దీంతో అందులోని కొన్ని ఎంజైములు ఆక్సిజన్‌తో చర్య జరపడం వల్ల రంగు మారుతుంది. ఇది సాధారణ సహజ ప్రక్రియ. రంగు మారినంత మాత్రాన బంగాళాదుంప పాడైపోయిందని అర్థం కాదు.
నల్లబడకుండా ఉంచే సింపుల్ కిచెన్ టిప్
చల్లటి నీటిలో నానబెట్టడం: బంగాళాదుంపలను ముక్కలుగా కోసిన వెంటనే పూర్తిగా మునిగేలా చల్లటి నీటిలో వేసి ఉంచాలి. నీటిలో ఉంచడం వల్ల ముక్కలు గాలికి నేరుగా గురికాకుండా ఉండటంతో ఆక్సిడేషన్ నెమ్మదిస్తుంది. అలాగే కొంత అదనపు స్టార్చ్ కూడా నీటిలోకి వెళ్లిపోతుంది. బంగాళాదుంపలను కొంతసేపు ముందుగా సిద్ధం చేసి పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. ఇందుకోసం వేడి నీటికి బదులుగా చల్లటి నీటినే ఉపయోగించడం మంచిది.
నిమ్మరసం లేదా వెనిగర్ వాడకం: చల్లటి నీటిలో కొన్ని చుక్కల నిమ్మరసం లేదా కొద్దిగా వైట్ వెనిగర్ కలిపి అందులో కోసిన బంగాళాదుంప ముక్కలను ఉంచవచ్చు. ఆమ్లత్వం పెరగడం వల్ల ఆక్సిడేషన్ ప్రక్రియ కొంత నెమ్మదించి, ముక్కలు త్వరగా గోధుమ రంగులోకి మారకుండా ఉండేందుకు సహాయపడుతుంది.
జిప్‌లాక్ బ్యాగ్స్ లేదా ఎయిర్‌టైట్ కంటైనర్లు: కోసిన బంగాళాదుంపలను గాలి చొరబడని జిప్‌లాక్ బ్యాగ్ లేదా ఎయిర్‌టైట్ కంటైనర్‌లో ఉంచాలి. జిప్‌లాక్ బ్యాగ్ ఉపయోగిస్తే వీలైనంత గాలిని బయటకు తీసి సీల్ చేయడం మంచిది.
ఫ్రిజ్‌లో నిల్వ చేయడం: బంగాళాదుంప ముక్కలను చల్లటి నీటిలో పూర్తిగా మునిగేలా ఉంచి, మూతపెట్టి ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చు. చల్లటి ఉష్ణోగ్రత ఆక్సిడేషన్ వేగాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
అయితే బంగాళాదుంపలను అవసరానికి చాలా ముందుగానే కోసి పెట్టుకోవడం కంటే, వంటకు దగ్గరగా కోసుకోవడమే ఉత్తమం. ముందుగానే సిద్ధం చేసుకోవాల్సి వస్తే, ఈ చిట్కాలను పాటించడం ద్వారా ముక్కలు తాజాగా, రంగు మారకుండా ఉండేలా చూసుకోవచ్చు.
