తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి అల్లరి సుభాషిణి కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఒకప్పుడు తనదైన కామెడీ టైమింగ్, ప్రత్యేకమైన నటనతో ప్రేక్షకులను నవ్వించిన ఆమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితం, హైదరాబాద్‌తో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

హైదరాబాద్‌తో ప్రత్యేక అనుబంధం

ఒకప్పుడు హైదరాబాద్‌లో నివసించిన రోజులను గుర్తుచేసుకుంటూ సుభాషిణి భావోద్వేగానికి గురయ్యారు. కృష్ణానగర్, ఇందిరానగర్, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాలతో తనకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ తనకు సొంత ఇల్లు లాంటిదని, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు తనపై ఎంతో ప్రేమాభిమానాలు చూపించారని చెప్పారు.

తన సినీ ప్రయాణంలో శ్రీశైలం యాదవ్ ఎంతో సహాయం చేశారని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉండేదని, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న నవీన్ యాదవ్‌తో కూడా సన్నిహిత సంబంధం ఉండేదని తెలిపారు. వారి ఇంటికి వెళ్లి భోజనం చేసేవారని, ఆ కుటుంబం తనను ఎంతో ఆప్యాయంగా చూసుకునేదని చెప్పారు.

అయితే అనారోగ్య సమస్యలు ఎదురైన తర్వాత పరిస్థితులు మారాయని, హైదరాబాద్‌ను విడిచి భీమవరం వెళ్లాల్సి వచ్చిందని సుభాషిణి ఆవేదన వ్యక్తం చేశారు.

నాటకరంగం నుంచి సినిమాల్లోకి..

సుభాషిణి తన నటనా ప్రస్థానాన్ని నాటకరంగం ద్వారా ప్రారంభించారు. మద్రాసులో చింతామణి నాటకాలు ప్రదర్శిస్తున్న సమయంలో ప్రముఖ నటుడు చలపతిరావు ఆమెను గుర్తించారు. అప్పట్లో రాళ్లపల్లి వంటి పలువురు సినీ ప్రముఖులు కూడా నాటకాలను వీక్షించేవారని ఆమె తెలిపారు.

చలపతిరావు తనను ఇంటికి ఆహ్వానించి ఆదరించారని గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత పరుచూరి వెంకటేశ్వరరావు నిర్వహించిన ఆగస్టు 15 నాటక కార్యక్రమంలో మరోసారి ఆమె నటనను చూసిన చలపతిరావు.. తన కుమారుడు రవిబాబు సినిమా చేస్తున్నాడని, వెళ్లి అవకాశం కోసం ప్రయత్నించాలని సూచించారట.

సినిమాలో పాత్ర నచ్చితే చేయాలని, లేకపోతే బాధపడాల్సిన అవసరం లేదని ఆయన చెప్పినట్లు సుభాషిణి వివరించారు.

పోలీసుల సహాయంతో సినిమా అవకాశం

సినిమా యూనిట్ సభ్యులు తన భీమవరం చిరునామాను గుర్తించలేకపోయారని సుభాషిణి తెలిపారు. దీంతో చలపతిరావు పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి తన ఆచూకీ తెలుసుకోవాలని కోరారట. స్థానిక సీఐ ఓ కానిస్టేబుల్‌ను తన ఇంటికి పంపించి సినిమా అవకాశం గురించి సమాచారం అందించారని చెప్పారు.

ఆ విషయం తెలియగానే తాను వెంటనే హైదరాబాద్‌కు బయలుదేరి వచ్చానని గుర్తుచేసుకున్నారు. అలా తనకు సినిమా రంగంలో తొలి అవకాశం లభించిందని వివరించారు.

నైటీతోనే తొలి షూటింగ్.. రవిబాబును చూసి భయం!

తన మొదటి సినిమా షూటింగ్ అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ సుభాషిణి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తొలి రోజు నైటీతోనే షూటింగ్‌కు వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. అలా షూటింగ్‌లో పాల్గొనడానికి మొదట సిగ్గుగా అనిపించినప్పటికీ, సినిమాలో పాత్రకు అదే సరైన దుస్తులని దర్శకుడు రవిబాబు చెప్పడంతో నటించానని తెలిపారు.

తన జీవితంలో ఎప్పుడూ ఎవరికీ భయపడలేదని, కానీ దర్శకుడు రవిబాబును చూసి మాత్రం భయపడ్డానని సరదాగా వ్యాఖ్యానించారు.

Live Updates in DTV Digita

‘అల్లరి’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుభాషిణి.. ఆ తర్వాత అల్లరి సుభాషిణిగా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. తన ప్రత్యేకమైన హావభావాలు, డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్‌తో ఎన్నో సినిమాల్లో అలరించారు. తాజాగా ఆమె పంచుకున్న ఈ అనుభవాలు సినీ అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తున్నాయి.