
మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. టీడీపీ, వైఎస్సార్‌సీపీకి ప్రత్యామ్నాయంగా కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. విజయదశమి తర్వాత వచ్చే ఏకాదశి రోజున పార్టీని ఆవిష్కరిస్తామని తెలిపారు.
రాయలసీమ అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు, వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వాలపై విజయసాయి రెడ్డి విమర్శలు చేశారు. రాయలసీమకు తగిన ప్రాధాన్యం దక్కలేదని, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యం జరిగిందని ఆరోపించారు. తన పార్టీ రాయలసీమ అభివృద్ధితో పాటు అన్ని కులాలు, మతాలను గౌరవించే విధంగా పనిచేస్తుందని పేర్కొన్నారు.
తాను ఏర్పాటు చేయబోయే పార్టీ ఒరిజినల్ రెడ్ల ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసాన్ని కాపాడేలా పనిచేస్తుందని విజయసాయి రెడ్డి తెలిపారు. అదే సమయంలో రాయలసీమ కేవలం ఒక సామాజికవర్గానికే పరిమితం కాదని, ఈ ప్రాంతానికి చెందిన అనేక వర్గాల ప్రజలు దేశం కోసం త్యాగాలు చేశారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
తన పార్టీ ఏపీ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని ఆయన అన్నారు. తమిళనాడులోని టీవీకే తరహాలో ప్రజల మద్దతు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యువతకు పెద్దపీట వేస్తామని, పార్టీ అధికారంలోకి వస్తే సామాజిక సేవా దృక్పథం ఉన్న యువకుడిని ముఖ్యమంత్రిగా చేసే ఆలోచన ఉందని తెలిపారు.
తన కుమార్తె త్వరలో టీవీ ఛానల్‌ను ప్రారంభించనున్నారని, దానితో తనకు ఎలాంటి సంబంధం ఉండదని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. ఆ ఛానల్ తటస్థంగా పనిచేస్తుందని తెలిపారు.
