
జీహెచ్ఎంసీలో వేతనాల అంశం ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారింది. దానికి కారణం ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన 25 మంది ఐటీ నిపుణుల భర్తీకి విడుదలైన టెండర్ నోటిఫికేషన్. ఇందులో బీటెక్, ఎంటెక్ అర్హత కలిగిన ఐటీ ఉద్యోగులకు రూ. 28 వేల నుంచి రూ. 42 వేల లోపు వేతనాలు ప్రతిపాదించారు. అయితే.. జీహెచ్‌ఎంసీలో పనిచేసే పర్మనెంట్ శానిటేషన్ కార్మికుల జీతాలు రూ. 50 వేల నుంచి రూ.80 వేల వరకు ఉన్నాయి. కొత్తగా డెరెక్ట్ రిక్రూట్ చేసుకొనే శానిటేషన్ సిబ్బంది సైతం రూ.30- 35 వేల మధ్య చెల్లిస్తుండగా.. బీటెక్, ఎంటెక్ చదివినా ఐటీ నిపుణులకు మాత్రం తక్కువ జీతంతో నోటిఫికేషన్ విడుదలైంది.
హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (GHMC) ఐటీ నిపుణుల కొరతను తీర్చేందుకు జారీ చేసిన ఒక టెండర్ నోటిఫికేషన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నగరంలో ఎంతో ఆఫర్ చేస్తున్న వేతనాలు శాశ్వత కంటే చాలా తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. జీహెచ్‌ఎంసీ ఒక సంవత్సరం కాల పరిమితిపై ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన 25 మంది ఐటీ ప్రొఫెషనల్స్‌ను నియమించుకోవడానికి తాజాగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే ఇందులో ప్రతిపాదించిన పే స్కేల్ ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారింది.
ఈ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. హార్డ్‌వేర్ ఇంజనీర్లు, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్లు, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్లు, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్లు, ప్రోగ్రామర్లు, టీమ్ లీడర్లు, జీఐఎస్ అనలిస్ట్‌లు, వెబ్ డిజైనర్ల వంటి వివిధ విభాగాల నిపుణుల కోసం జీహెచ్‌ఎంసీ దరఖాస్తులను కోరింది. అయితే వీరికి కేటాయించిన వేతనాల వివరాలు గమనిస్తే.. 12 మంది హార్డ్‌వేర్ ఇంజనీర్ల పోస్టులకు నెలకు రూ. 28 వేల చొప్పున వేతనం ప్రతిపాదించారు. కనీసం మూడేళ్ల అనుభవంతో పాటు ఎంటెక్ ఉన్నత విద్యార్హత కలిగిన సీనియర్ జీఐఎస్ అనలిస్ట్‌కు నెలకు రూ. 37 వేలు మాత్రమే చెల్లించనున్నారు. బీటెక్ విద్యార్హతతో పాటు ఆరు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం గల వెబ్ డిజైనర్ పోస్టుకు కేవలం రూ. 42 వేలు వేతనంగా నిర్ణయించారు.

