D news:nov:9బరువు తగ్గాలనుకునే వారు, వేసవి వేడి నుంచి ఉపశమనం పొందాలనుకునే వారు తమ ఆహారంలో కీరదోసకాయకు ప్రత్యేక స్థానం ఇస్తుంటారు. ఇందులో నీటి శాతం, ఫైబర్ అధికంగా ఉండటంతో ఆరోగ్యానికి మేలు చేస్తుందని భావిస్తారు. అయితే కీరదోసకాయ అందరికీ అనుకూలం కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా సున్నితమైన జీర్ణవ్యవస్థ కలిగిన వారు దీనిని ఎక్కువగా తీసుకుంటే ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఎవరి శరీరతత్వానికి అనుగుణంగా వారు కీరదోసకాయను పరిమితంగా తీసుకోవడం మంచిది.

కీరదోసకాయలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని భావించి చాలామంది వాటిని ఆహారంలో భాగంగా తీసుకుంటారు. అయితే, కొన్ని కీరదోసకాయలు చేదుగా ఉండటం ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చేదు రుచికి కారణమైన ‘కుకుర్బిటాసిన్స్’ అనే సహజ రసాయనాలు శరీరంలోకి చేరితే వికారం, వాంతులు, తీవ్రమైన కడుపునొప్పి వంటి సమస్యలు తలెత్తవచ్చు. అందువల్ల చేదుగా ఉన్న కీరదోసకాయలను ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు.

మరోవైపు, మార్కెట్ నుంచి కొనుగోలు చేసిన కీరదోసకాయలను శుభ్రంగా కడగకుండా తినడం వల్ల వాటిపై ఉండే బ్యాక్టీరియా కారణంగా ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి తినే ముందు వాటిని నీటితో పూర్తిగా శుభ్రం చేసుకోవాలి.

ముఖ్యంగా కిడ్నీ సమస్యలతో బాధపడేవారు కీరదోసకాయలను తమ ఆహారంలో చేర్చుకునే ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *