వర్షాకాలంలో చల్లటి వాతావరణంలో వేడివేడిగా, రుచికరమైన స్నాక్ తినాలనిపిస్తే నల్ల శెనగల చాట్‌ను తప్పకుండా ట్రై చేయండి. రుచితో పాటు ఆరోగ్యాన్నీ అందించే ఈ స్నాక్‌ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. నల్ల శెనగల్లో ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, పలు విటమిన్లు వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి. అందుకే వర్షాకాలంలో టేస్టీగా, పోషకమైన స్నాక్ కావాలనుకునేవారికి నల్ల శెనగల చాట్ మంచి ఎంపికగా చెప్పొచ్చు.

నల్ల శెనగల చాట్ తయారు చేయడానికి ముందుగా ఒక కప్పు నల్ల శెనగలను శుభ్రంగా కడిగి కనీసం రెండు గంటల పాటు నీటిలో నానబెట్టాలి. అనంతరం నీటిని వంపేసి, కుక్కర్‌లో శెనగలు, ఒకటిన్నర కప్పు నీరు, కొద్దిగా ఉప్పు వేసి 3–4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. శెనగలు మెత్తగా ఉడికిన తర్వాత నీటిని పూర్తిగా వంపేసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు మిక్సర్ జార్‌లో కొత్తిమీర, పుదీనా ఆకులు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొద్దిగా బెల్లం, బ్లాక్ సాల్ట్, వెల్లుల్లి వేసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.
తర్వాత స్టవ్‌పై పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసి తాలింపు పెట్టాలి. అవి చిటపటలాడిన తర్వాత ఉడికించిన నల్ల శెనగలను వేసి కలపాలి. అనంతరం కారం, ధనియాల పొడి, చాట్ మసాలా, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.
ఇందులో ముందుగా సిద్ధం చేసుకున్న కొత్తిమీర పేస్ట్‌ను వేసి మరో నిమిషం పాటు వేయించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, సన్నగా తరిగిన టమాటా, ఉల్లిపాయ, కొత్తిమీర తరుగు వేసి కలపాలి. చివరగా నిమ్మరసం పిండుకుని మరోసారి బాగా మిక్స్ చేయాలి.
అంతే.. పుల్లగా, కారంగా, రుచికరంగా ఉండే నల్ల శెనగల చాట్ సిద్ధం. సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని వెంటనే సర్వ్ చేసుకోవచ్చు. సాయంత్రం సమయంలో తేలికపాటి స్నాక్‌గా ఈ చాట్‌ను ఆస్వాదించవచ్చు.
