D news:nov:13పరగడుపున గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయని, కిడ్నీల్లో పేరుకుపోయిన మలినాలు బయటకు వెళ్లిపోతాయని చాలామంది భావిస్తుంటారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు, ఆరోగ్యంపై శ్రద్ధ చూపేవారు ఈ అలవాటును తమ రోజువారీ దినచర్యలో భాగం చేసుకుంటున్నారు. అయితే నిత్యం నిమ్మరసం తాగడం నిజంగానే కిడ్నీల ఆరోగ్యానికి మేలు చేస్తుందా? మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు కూడా ఎలాంటి ఆందోళన లేకుండా దీనిని తీసుకోవచ్చా? నిమ్మరసం వల్ల కలిగే ప్రయోజనాలు, పరిమితులు, కిడ్నీ రోగులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆరోగ్య నిపుణులు, డైటీషియన్లు ఏమంటున్నారో తెలుసుకుందాం.

నిమ్మకాయల్లో సహజంగా లభించే సిట్రేట్ మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా కాల్షియం ఆక్సలేట్ రాళ్లు ఏర్పడే అవకాశాలను తగ్గించడంలో ఇది సహాయపడుతుందని నవీ ముంబైలోని ఖార్ఘర్ మెడికవర్ హాస్పిటల్ డైటెటిక్స్ విభాగాధిపతి డాక్టర్ రాజేశ్వరి పాండా వెల్లడించారు. ఆరోగ్యవంతులు పరిమిత మోతాదులో నిమ్మరసం కలిపిన నీటిని తీసుకోవడం వల్ల ప్రయోజనం పొందవచ్చని ఆమె తెలిపారు. అయితే కిడ్నీల ఆరోగ్యానికి నిమ్మరసం ఒక్కటే సరిపోదని, రోజంతా తగినంత సాధారణ నీటిని తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం కూడా ఎంతో ముఖ్యమని వివరించారు.

ఆరోగ్యవంతులకు మేలు చేసే నిమ్మరసం, కిడ్నీ సమస్యలతో బాధపడేవారికి కూడా అదే విధంగా ఉపయోగపడుతుందని భావించడం సరికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా క్రానిక్ కిడ్నీ డిసీజ్ (CKD) ముదిరిన దశలో ఉన్నవారికి వైద్యులు రోజువారీ ద్రవపదార్థాల పరిమాణాన్ని పరిమితం చేస్తుంటారు. అలాంటివారు నిమ్మరసాన్ని కూడా తమకు సూచించిన ద్రవాల పరిమితిలోనే తీసుకోవాలి. మరోవైపు కిడ్నీల పనితీరు తగ్గినప్పుడు రక్తంలో పొటాషియం స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంటుంది. నిమ్మకాయల్లోనూ కొంత పొటాషియం ఉండటంతో కిడ్నీ వ్యాధిగ్రస్తులు, డయాలసిస్ చేయించుకునేవారు వైద్యుల సలహా లేకుండా నిమ్మరసం తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

నిమ్మరసం ఆరోగ్యానికి మంచిదనే ఉద్దేశంతో రోజూ అధిక పరిమాణంలో తీసుకోవడం కూడా మంచిది కాదు. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ అధికంగా శరీరంలోకి చేరితే కొందరిలో ఎసిడిటీ, కడుపులో మంట, ఛాతీలో మంట వంటి సమస్యలు తలెత్తవచ్చు. అంతేకాకుండా నిమ్మరసంలోని ఆమ్ల గుణం దంతాలపై ఉండే రక్షణ పొర అయిన ఎనామెల్‌ను క్రమంగా దెబ్బతీసే అవకాశం ఉంది. దీనివల్ల పళ్లు సున్నితంగా మారి చల్లని, వేడి పదార్థాలు తీసుకున్నప్పుడు ఇబ్బంది కలగవచ్చు.

నిమ్మరసం తాగితే కిడ్నీ సంబంధిత వ్యాధులు పూర్తిగా నయమవుతాయనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇది సమతుల్య ఆహారం, సరైన హైడ్రేషన్‌లో భాగంగా మాత్రమే ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రోజూ నిమ్మరసం తాగాలనే నియమం లేదు. ముఖ్యంగా కిడ్నీ సమస్యలున్నవారు తమ రక్తంలోని ఎలక్ట్రోలైట్ల స్థాయులు, మూత్రపిండాల పనితీరును పరిగణనలోకి తీసుకుని వైద్యుల సూచనల మేరకు ఆహారపు అలవాట్లను నిర్ణయించుకోవాలి.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆరోగ్య చిట్కాలు, డైట్ ట్రెండ్స్‌ను పూర్తిగా నమ్మి ఆచరించడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒకరికి ప్రయోజనం కలిగించే ఆహారపు అలవాటు మరొకరికి హాని కలిగించవచ్చు. ముఖ్యంగా కిడ్నీ సంబంధిత సమస్యలున్నవారు సొంతంగా ఆహార నియమాలు మార్చుకోవడం లేదా నిమ్మరసాన్ని ఔషధంలా భావించి తీసుకోవడం చేయకూడదు. వైద్యుల సూచనల ప్రకారం తగినంత ద్రవాలను తీసుకుంటూ, సమతుల్య ఆహారం పాటిస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *