ప్రతి సాయంత్రం లేదా రాత్రి భోజనానికి కొత్తగా, ఆరోగ్యకరమైన వంటకం కోసం చూస్తున్నారా? అయితే జొన్న మెంతి పరాటా మంచి ఎంపికగా నిలుస్తుంది. రుచితో పాటు పోషకాలను అందించే ఈ పరాటాను సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. ముఖ్యంగా బరువు నియంత్రణపై దృష్టి పెట్టేవారు, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలనుకునేవారు తమ ఆహారంలో దీనిని చేర్చుకోవచ్చు.

జొన్నపిండిని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని, తరిగిన ఉల్లిపాయ, తురిమిన కీరా, క్యారెట్, సన్నగా తరిగిన మెంతికూరను వేసి కలపండి. మెంతికూర అందుబాటులో లేకపోతే పాలకూరను ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. ఇందులో దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి–అల్లం మిశ్రమం, చిటికెడు పసుపు, పావు టీస్పూన్ వాము, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. వామును చేతితో కొద్దిగా నలిపి వేస్తే దాని సువాసన మరింతగా వస్తుంది. వాము ఇష్టం లేకపోతే జీలకర్రను ఉపయోగించవచ్చు.

ముందుగా నీళ్లు పోయకుండా పదార్థాలన్నింటినీ కలపండి. కీరా, ఉప్పు కారణంగా కూరగాయల నుంచి కొంత తేమ బయటకు వస్తుంది. ఆ తర్వాత కొద్దికొద్దిగా గోరువెచ్చని లేదా వేడి నీటిని పోస్తూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. జొన్నపిండిని చపాతీ పిండిలా గట్టిగా కాకుండా కొద్దిగా మెత్తగా ఉండేలా చూసుకోవాలి. అవసరాన్ని బట్టి పిండి లేదా నీటిని సర్దుబాటు చేసుకోవచ్చు. పిండిలో నూనె లేదా నెయ్యి కలపాల్సిన అవసరం లేదు.

ఇప్పుడు ఒక కాటన్ వస్త్రాన్ని నీటిలో తడిపి, అదనపు నీటిని పిండేయాలి. ఆ తడి వస్త్రంపై పిండి ముద్దను ఉంచి, చేతిని కొద్దిగా తడి చేసుకుని గుండ్రంగా వత్తుకోవాలి. చపాతీ కర్ర అవసరం లేకుండా వీలైనంత పల్చగా పరాటాను తయారు చేసుకోవచ్చు.

పెనాన్ని వేడి చేసి కొద్దిగా నూనెతో గ్రీస్ చేయాలి. తడి వస్త్రంపై వత్తుకున్న పరాటాను వస్త్రంతో సహా పెనంపై ఉంచి, జాగ్రత్తగా వస్త్రాన్ని తొలగించాలి. పరాటాపై కొద్దిగా నీటిని చిలకరించి, సుమారు అర టీస్పూన్ నూనె లేదా నెయ్యి వేసి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. ఇలా తయారైన వేడి వేడి జొన్న మెంతి పరాటాను పెరుగు లేదా మీకు నచ్చిన కూరతో సర్వ్ చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *